చీకటి కోణాలను తరచిచూస్తే ఎన్నో కథనాలు కళ్లముందునిలుస్తాయి. వాటిలో కొన్ని మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. 40ఏళ్ల క్రిందటి ఎమర్జెన్సీ చీకటి రోజుల నేపథ్యంలోని కథనాలు, సంఘటనలపై ఆ తర్వాతి కాలంలో ఒకటొకటిగా వెలుగుచూసి ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. మరికొన్ని గాసిప్స్ గానో లేదా డిబెటబుల్ టాపిక్స్ గానో మిగిలిపోతూనే ఉన్నాయి. అలాంటివాటిలో ఒక వార్తాకథనం గురించే ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోతున్నాం.
`పుల్టిజర్’ అవార్డ్ (ఈ అవార్డును న్యూస్ పేపర్, ఆన్ లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీతం వంటి అంశాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తుంటారు )గ్రహీత లూయిస్ ఎం.సిమన్స్ అప్పట్లో రాసిన ఒక వార్తాకథనం సంచలనం సృష్టించింది. ఆ వార్తాకథనం ప్రకారం, ఒక డిన్నర్ పార్టీలో సంజయ్ గాంధీ తన తల్లి ఇందిరాగాంధీని ఒకసారికాదు, రెండుసార్లుకాదు ఆరుసార్లు చెంపదెబ్బ కొట్టారట ! అయితే ఈ కథనానికి `సోర్స్ పేర్లు’ రచయిత వెల్లడించకపోవడంతో ఇదంతా కట్టుకథంటూ కొట్టిపారేసేవారూ ఉన్నారు.
` స్క్రోల్. ఇన్’ అనే ఆన్ లైన్ ఎడిషన్ లో అజాజ్ అష్రాఫ్ ఈమధ్యనే సిమన్స్ ని ఈ-మెయిల్స్ ద్వారా ఇంటర్వ్యూచేశారు. అప్పుడు మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. సిమన్స్ అప్పట్లో వాషింగ్టన్ పోస్ట్ కోసం ఢిల్లీలో పనిచేసిన కరెస్పాండెంట్.
ఎమర్జన్సీరోజుల్లోనే – `ఇందిరాగాంధీ – సంజయ్ ల మధ్య ఘర్షణ వాతావరణంలో అలా జరిగిందట, మీకు తెలుసా?’ –అంటూ గుసగుసలుగా (గాసిప్స్ గా) చెప్పుకునేవారు. బహిరంగంగా మాత్రం ఈ కథనం గురించి చెప్పుకునే ధైర్యంచేయలేకపోయారు. వాషింగ్టన్ పోస్ట్ ఈ వార్తాకథనాన్ని ప్రచురించడంతో గుప్పుమంది. కాగా, అలనాటి కథనంపై సిమన్స్ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
దేశం విడిచివెళ్లమన్నారు
ఉన్నట్టుండి దేశం విడిచిపోవాల్సిందిగా సిమన్స్ కు నోటీస్ జారీచేశారు. కేవలం ఐదుగంటల్లో వెళ్ళిపోవాలన్నది దాని సారాంశం. సాయుధ పోలీసులు ఆయన్ని ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్ళి పేపర్ వర్క్స్ పూర్తిచేయించారు. అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఒకవ్యక్తి – సిమన్స్ ను ఎయిర్ పోర్ట్ కు తీసుకువెళ్ళి బాంగ్ కాక్ వెళ్ళే విమానం ఎక్కించారు. అతని దగ్గరున్న నోట్ బుక్స్ ని భారత అధికారులు స్వాధీనంచేసుకున్నారు. ఆ పుస్తకాల్లోఉన్న పేర్ల ఆధారంగా కొంతమందిని రాత్రికిరాత్రి అరెస్ట్ చేశారు. సిమన్స్ తన భార్య,ఇద్దరు పిల్లలను వదిలేసి అప్పటికప్పుడు దేశం విడిచివెళ్ళాల్సివచ్చింది. సిమన్స్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. టెలీఫోన్ కనెక్షన్ కట్ చేశారు. కుటుంబసభ్యులపై పూర్తి నిఘాపెట్టారు.
ఇక్కడొక ఆసక్తికరమైన సంగతి చెప్పుకోవాలి. లూయిస్ సిమన్స్ దేశం విడిచివెళ్ళాల్సివచ్చింది ఆయన రాసిన ఈ `చెంపపెట్టు కథనం’వల్ల మాత్రంకాదు. ఈ కథనంకంటే ముందే ఆయన, భారతీయ ఆర్మీ అధికారులు ఎమర్జెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలపై ఒక వార్తరాశారు. ఈ వార్తకు ప్రతిస్పందనగానే సిమన్స్ పై ఈ చర్య తీసుకున్నారు. కాగా, `చెంపపెట్టు’ కథనాన్ని ఆయన బ్యాంగ్ కాక్ కి వెళ్ళినతర్వాత రాశారు.
కథనానికి సోర్స్ ఏమిటి ?
చెంపపెట్టు కథనంలో సిమన్స్, సోర్స్ పేర్లు వెల్లడించలేదు. ఈ సమాచారం ఎవరు ఇచ్చారో వారి పేర్లును గుట్టుగానేఉంచారు. ఈ సంఘటన ఒక ప్రైవేట్ డిన్నర్ పార్టీలో జరిగింది. ఎమర్జెన్సీ విధించడానికి కొద్దిగా ముందు జరిగిన సంఘటన ఇది. అలాంటి విందుసమావేశాల్లోని విశేషాలను జర్నలిస్టులు అనేక సోర్స్ ల ద్వారా సేకరిస్తుంటారు. వాటన్నింటినీ వెంటనే వార్తల రూపంలోకి మార్చరు. అవసరాన్నిబట్టి వాడుకుంటారు. అలాగే తానుకూడా వెంటనే ఈ స్టోరీ రాయలేదని సిమన్స్ ఇంటర్వ్యూలో చెప్పారు.
అసలు ఆయనకు ఈ సమాచారం చెప్పిన వ్యక్తులు ఎవరన్నది సీక్రెట్. వారంతటవాళ్లు వచ్చి ఉద్దేశపూర్వకంగా సిమన్స్ కు తెలియజేశారా లేక, ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు విషయం రాబట్టారా అన్న ప్రశ్నకు సిమన్స్ సమాధానమిస్తూ, `నాకు సోర్స్ లుగా ఉన్న ఇద్దరు ఒకరినొకరు బాగా పరిచయస్తులు, పైగా ఇద్దరూ డిన్నర్ పార్టీకి వెళ్ళినవారే, ఎమర్జెన్సీ విధింపునకు ముందు మా ఇంటికి వచ్చినప్పుడు క్యాజువల్ గా చెప్పిన విషయాలు సోర్స్ అయ్యాయి’ అని సిమన్స్ చెప్పుకొచ్చారు.
సీనియర్ జర్నలిస్ట్ కూమి కపూర్ ఈమధ్యనే ఒక పుస్తకం రాశారు. దాని పేరు `The Emergency: A Personal History’ . ఈ పుస్తకంలో చెంపపెట్టు కథనం ప్రస్తావన ఉంది. ఈ కథనం ఎమర్జెన్సీ సెన్సార్ షిప్ కారణంగా ఏ న్యూస్ పేపర్లో రాకపోయినప్పటికీ, అప్పట్లో కారుచిచ్చులా గాసిప్ స్ప్రెడ్ అయిందన్నది పుస్తకంలో రచయిత కపూర్ ప్రస్తావించడం గమనార్హం.
ఇదేమన్నా మమ్మల్ని ఆశ్చర్యపరిచిందా అని అడిగినప్పుడు సిమన్స్ – `లేదు, గాసిప్స్ ఇండియాలో బాగా చెప్పుకుంటారు. అదే జరిగింది. విదేశీ మీడియా దుకాణాల్లోనే బాగా స్ప్రెడ్ అయింది. న్యూయార్కర్ మేగజైన్ లో కూడా ఈ కథనం వచ్చింది ‘
వార్తాకథనానికి ఉప్పందించిన (సోర్స్) వారిపేర్లు వెల్లడించకపోవడంవల్ల ఈ కథనానికి విశ్వసనీయతలేదన్న వాదన గురించి సిమన్స్ మాట్లాడుతూ, ‘సోర్స్’ లో విశ్వసనీయతఉంది. ఇది తిరుగులేనిది. నేను ఈ విషయమై విందుకుహాజరైన వారిలో మిగతావారి నుంచి ఆరాతీయలేదు. ఈ స్టోరీ ఇవ్వడంపై అప్పటికీ, ఇప్పటికీ ఫీలవడంలేదు’ అని చెప్పారు. అయితే ఉప్పందించిన వ్యక్తులెవరో వారి వివరాలేమిటో ఇప్పటికీ తెలియజేయడం తనకిష్టంలేదని స్పష్టంచేశారాయన. ఆ వ్యక్తులు ఇప్పటికీ జీవించేఉన్నారని మాత్రం అంటున్నారాయన.
దేశం విడిచి వెళ్లమన్నారు
మిమ్మల్ని దేశం విడిచివెళ్ళమనడంవెనుక కథేమిటని అడిగినప్పుడు సిమన్స్ సమాధానమిస్తూ, తనను దేశం విడిచి వెళ్లమని వారు కోరలేదు, ఆదేశించారు. `అయితే నా ఈ కథనం వల్ల ఇది జరగలేదు. అప్పటికి నేను ఈ కథనం రాయనేలేదు. అప్పటికే ఎమర్జెన్సీపై అభిప్రాయాల సేకరణగా రాసిన స్టోరీవల్లనే అది జరిగింది. భారతసైన్యంలోని అనేక మంది అధికారుల అభిప్రాయాలను అందులో చెప్పాను. దాని ఫలితమే నా దేశబహిష్కారం’ అని చెప్పుకొచ్చారు. ఆఘమేఘాలమీద నన్ను బ్యాంగ్ కాక్ విమానంఎక్కించేశారు. బ్యాంగ్ కాక్ లో ఒక హోటల్ ఉన్నప్పుడు ఈ కథనం రాశాను’ అని అలనాటి సంఘటనలను సిమన్స్ గుర్తుచేసుకున్నారు.
తర్వాత కూడా ఇందిరాగాంధీని కలిశాను
`ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం ఆశ్చర్యపరిచింది, భారతదేశంలో అదికుదరదనే అనుకున్నాను, ఎందుకంటే ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా గుర్తింపుపొందింది. అమెరికావంటి దేశాల్లోకానీ, మరెక్కడకానీ ఇలా జరిగినా నాకంత ఆశ్చర్యం కలిగిఉండేదికాదు’ అని సిమన్స్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ కథనం వెలుగుచూసిన తర్వాత ఇందిరాగాంధీతో కలుసుకునే సందర్భం వచ్చిందనీ, ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఇందిరాగాంధీకి పతనం తప్పలేదు. మురార్జీదేశాయ్ ప్రభుత్వం ఏర్పాటైందప్పుడు. `ఇందిరాగాంధీ నివాసంలో ఇంటర్వ్యూఇచ్చినప్పుడు నాతోపాటు ఒక బ్రిటీష్ కరెస్పాండెంట్ కూడా ఉన్నాడు. ఈ బ్రిటీష్ జర్నలిస్ట్ కూడా అప్పట్లో నాతర్వాత దేశం నుంచి బహిష్కరించబడ్డాయనే..’
మరోసారి ఒక విందుసమావేశంలో రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియాగాంధీ పాల్గొన్నప్పుడు ఎవరోఒకాయన తన గురించి చెబుతూ స్లాపింగ్ సంఘటన ప్రస్తావించినప్పటికీ రాజీవ్ చిరునవ్వుతూ తలవూపారని సిమన్స్ గుర్తుచేసుకున్నారు.
నాటి అనుభవాలు,అలనాటి కథనం సృష్టించిన ప్రభంజనం గురించి సిమన్స్ తన ఈమెయిల్ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకోవడంతో మరోసారి చీకటిరోజుల వెనుక దాగున్న వాస్తవాలు వెలుగులోకివచ్చినట్లయింది.
– కణ్వస