ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఏపీ ప్రభుత్వానికి శుక్రవారం గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నారు. సస్పెన్షన్ విధించి రెండేళ్లు కావడం… ఇంకా పొడిగించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కావడం.. ఇప్పటి వరకూ అలాంటి అనుమతి ఏమీ కేంద్రం ఇవ్వకపోవడంతో .. దిక్కుతోచని స్థితిలో ఏపీ ప్రభుత్వం పడిపోయింది. గురువారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఏబీ సస్పెన్షన్నుఇంకా ఎంత కాలం కొనసాగిస్తారని ప్రశ్నించింది.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలను సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాల కోసం చూస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం ఏమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శుక్రవారంలోగా అన్ని వివరాలతో రావాలని పేర్కొంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని అభిప్రాయం పడింది.
శుక్రవారం విచారణ తర్వాత వాయిదా వేయడం కుదరదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరారవుపై అభియోగాలు పూర్తిగా నిరూపణ కాకుండానే… ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని కేంద్రానిక ిసిఫారసు చేసింది. ఇది చేసి చాలా కాలం అయింది. అయితే కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోందో కీలకమయ్యే అవకాశం ఉంది.