రాష్ట్రమంతా లక్షల మందికి సెంట్ స్థలాలిచ్చిపట్టుమని పది వేల మందికి కూడా ఇళ్లు కట్టివ్వకుండా.. కోర్టు కేసుల్లో ఉన్న అమరావతి పొలాల్లో సెంట్ స్థలాలిచ్చి ఇళ్లు కట్టేస్తామని బయలుదేరిన ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్ 5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసి పుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ కు వాయిదా వేసింది. అమరావతి ఆర్5 జోన్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని గతంలో ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఇస్తున్న పట్టాలు అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. సుప్రీంకోర్టు స్థలం ఇవ్వడానికి మాత్రమే అనుమతి గానీ కట్టడానికి కాదని తెలిపింది. సుప్రీంకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎవరు దీనికి భాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే కోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది. CRDA నిబంధనల ప్రకారం భూమి కోల్పోయిన వారికి హౌసింగ్ కోసం 5 శాతం భూమి కేటాయించారని… కానీ బయట వారికి స్థలాలు ఇస్తామని తెచ్చిన సవరణలు చర్చనీయాంశంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితులలో ఇళ్ళ నిర్మాణం అనుమతించ లేమని ధర్మానసం స్పష్టం చేసింది.
సుప్రీం లో కేసులు తేలిన తరువాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని తీర్పు చెప్పింది. అమరావతిని నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే కోర్ క్యాపిటల్ ఎరియాలో రైతులు ఇచ్చిన పొలాలను.. ఆర్ 5 జోన్ గా మార్చారనే విమర్శలు ఉన్నాయి. ఇతర చోట్ల స్థలాలు ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు కట్టించకుండా.. కేవలం రాజధానిలో ఆర్ 5 జోన్ లోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా.. రాజ్యాంగవిరుద్ధంగా చేస్తున్న కుట్రలు న్యాయస్థానాల్లో తెలిపోతున్నాయి.