హైదరాబాద్: జనవరిలో జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు తమదేనని టీఆర్ఎస్ కీలకనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేయించిన ఓ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నట్లు తేలిందట. ఆ సర్వే వివరాలను కేటీఆర్ తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశారు. వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఈ సర్వేను నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 70 డివిజన్లు గెలుచుకుంటుందట. తద్వారా మేయర్ పీఠాన్నికూడా గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కనున్నాయో కూడా సర్వే చెప్పింది. పాతబస్తీలో పట్టున్న మజ్లిస్ పార్టీ 42 డివిజన్లలో, కాంగ్రెస్ 16 డివిజన్లలో, తెలుగుదేశం 11 డివిజన్లలో, బీజేపీ 8 డివిజన్లలో, ఇతరులు 3 డివిజన్లలో విజయం సాధిస్తారని తేల్చింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్లో టీఆర్ఎస్కు 70 డివిజన్లు దక్కితే ఆ పార్టీ మంచి పురోగతి సాధించినట్లే.