‘ఈనాడు’ ఏ రంగంలో అడుగుపెట్టినా అగ్రగామిగా నిలవడానికే ప్రయత్నిస్తుంది. ఈ సంస్థ ‘ఈటీవీ విన్’ తో ఓటీటీలోకి ప్రవేశించింది. అయితే ఇప్పటివరకూ ఆ ఓటీటీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ లో ’90s’ తప్పితే ప్రజాదరణ పొందిన మరో కంటెంట్ లేదు. ఇప్పటివరకూ ఒక్క క్రేజీ సినిమా కానీ, కాంబినేషన్ కానీ ఈవిన్ లో రాలేదు. మీడియం రేంజ్ కంటే చిన్న సినిమాలు, మినిమం బడ్జెట్, లోబడ్జెట్ సినిమాలతో బండి నడిపే ప్రయత్నం జరుగుతోంది.
ఈనాడు కు చాలా గొప్ప ట్రాక్ రికార్డ్ వుంది. ఉషాకిరణ్ మూవీస్ లో చిన్న సినిమా చేసినా అది గ్రాండ్ గా వుంటుంది. ఏ విభాగంలోనూ ఎత్తి చూపేలా వుండదు. కానీ ఈనాడు లోగో వాడుకొని ఈవిన్ చేస్తున్న, కొంటున్న ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఆ సంస్థ గురించి తెలిసిన చాలా మందికి ఆ క్యాలిటీ, కంటెంట్ ఏమిటో అంతుచిక్కడం లేదు. బేసిక్ కంటే తక్కువ మేకింగ్ వాల్యూస్ వున్న సినిమాలు, సిరిస్ లు ఈ ఓటీటీలో కనిపిస్తున్నాయి.
తాజాగా ‘చిత్రం చూడరా’ సినిమా ఈ ఓటీటీలో నేరుగా విడుదలైయింది. వరుణ్ సందేశ్, ధనరాజ్, రవిబాబు, శివాజీ రాజా, తనికెళ్ళ భరణి.. ఇలా ప్రముఖ తారాగణం వుందని సినిమా క్లిక్ చేయడం మొదలుపెడితే.. ఆ కథ, కథనాలు, మాటలు, తీసిన విధానం, ఎడిటింగ్, మ్యూజిక్ బిత్తరపోయినట్లు చేశాయి. అంత పేలవమైన క్యాలిటీతో తీసిన సినిమాని ఈవిన్ లాంటి సంస్థ కనీసం క్యాలిటీ చెక్ లేకుండా ఎలా ప్రసారం చేస్తుందనిపించింది.
ఈవిన్ చాలా వరకూ ఇలాంటి లో బడ్జెట్, చిన్న సినిమాలపైనే ద్రుష్టి పెట్టడం కొంచెం విచిత్రం గానే వుంది. ప్రస్తుతం ఓటీటీ పోటీ గట్టిగా వుంది. కోట్లు ఖర్చు చేసి ఓరిజినల్స్ తీయకపోతే చందాదారులు పెరగడం లేదు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, సోనీ లీవ్ లాంటి సంస్థలు క్రేజీ, హైక్యాలిటీ ప్రాజెక్ట్స్ తో ముందు వరుసలో వున్నాయి. ఈనాడుకి కూడా వాటితో పోటీపడే వనరులు వున్నాయి. కానీ ఎందుకు కనీసం ‘ఆహా’తో కూడా పోల్చుకోలేని ప్రాజెక్ట్స్ చేస్తుంది.
ఆ సంస్థకు ఎలాంటి కథ తీసుకెళ్ళిన బడ్జెట్ మూడు కోట్లకు మించకూడదనే రూలు పెట్టుకుకొని కూర్చుకున్నారని, అందుకే మంచి కథలు వున్న దర్శక రచయితలు ఆ సంస్థవైపు వెళ్ళడం లేదనే మాట ఇండస్ట్రీ సర్కిల్స్ లో వుంది. స్టార్ ఎట్రాక్షన్ లేని చిన్న సినిమాలు, నిర్మాణ దశలో ఆగిపోయిన సినిమాలకు ఎదోలా మరామత్తులు చేయించి ఫోల్డర్ నింపునే ఆలోచనతోనే కనిపిస్తోంది. పైగా ప్రమోషన్స్ కూడా చాలా వీక్ గా కనిపిస్తున్నాయి. కనీసం వారి మీడియంలో కూడా ఈవిన్ లో వచ్చే ప్రాజెక్ట్స్ కి ప్రమోషన్ వుండదు. ఇవన్నీ చూస్తుంటే ఈవిన్ పై యాజమన్యం పెద్దగా ద్రుష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.
ఈటీవీ చేతిలో పాత క్లాసిక్ సినిమాలు వున్నాయి. అయితే కేవలం వాటిని నమ్ముకుని ఓటీటీ రంగంలో పోటీపడాలంటే కష్టం. చిన్న సినిమాలైనా క్యాలిటీ, కంటెంట్ పై ద్రుష్టి పెట్టాలి. పాత పద్దతిలో పోస్టర్ పై ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు చూసి సినిమాలు కొనే విధానంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఒరిజినల్ సిరీస్లు, సినిమాల తయారీపై ఫోకస్ చేయాలి. కనీసం నెలకు ఒకటి రెండైనా పెద్ద, క్రేజీ సినిమాపై వచ్చేలా చూసుకోవాలి. ఇలా కాకుండా ప్రస్తుతం విధానంలోనే ముందుకు వెళ్ళాలనుకుంటే ఓటీటీ రేసులో నిలవడం కష్టం.