తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశానికి హాజరు కావడం లేదు. గవర్నర్ ప్రసంగం, సంతాప తీర్మానాలు, బడ్జెట్ ప్రసంగం, ఆమోదం..ఇలా మొత్తం శరవేగంగా పూర్తి చేసుకుని సభను సర్దేసుకోవాలని అధికార పార్టీ నిర్ణయించింది. దీంతో ప్రతిపక్షం టీడీపీ .. అసెంబ్లీకి డుమ్మా కొట్టాలని నిర్ణయించింది. అయితే అధికారికంగా నిర్వహిస్తున్న అసెంబ్లీకి వెళ్లడం లేదు కానీ.. తాము సొంతంగా సభ నిర్వహించాలని నిర్ణయించారు. మామూలు సభ కాదు… తాము కూడా అసెంబ్లీనే నిర్వహించాలనుకుంటున్నారు. అధికారికంగా నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి… మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు.
మాక్ అసెంబ్లీ అంటే… అన్నీ తామే అయి.. అచ్చంగా అసెంబ్లీలాగే వ్యవహారాలు నడిపించడం. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కోసం మాక్ అసెంబ్లీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు… తాము అలా నిర్వహించి.. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ బయట పెట్టాలని నిర్ణయించారు. ఎలాగూ… టీడీపీ మీటింగ్లకు ఓ వర్గం మీడియా సహజంగానే కవరేజీ ఇవ్వదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక మీడియా మొత్తం టీడీపీ అనుకూల మీడియాగానే ప్రచారం పొందుతోంది కాబట్టి.. ఆ మీడియాలో ప్రచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే.. కొన్ని చానళ్లకు తమకు పబ్లిసిటీ లేకపోయినా పర్వాలేదని..అధికార పార్టీ అనుకుంటోంది.
కరోనా లేని సమయంలో కూడా.. ఒకటి, రెండు సార్లు అసెంబ్లీ నుంచి గెంటేసిన తర్వాతనో… వాకౌట్ చేసిన తర్వాతనో మాక్ అసెంబ్లీ టీడీపీ నిర్వహించేది. కానీ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో .. అసెంబ్లీ ప్రాంగణంలో వేరే అంశాలను లైవ్ ఇవ్వకూడదు. ఇలా ఇచ్చినందుకు కొన్ని చానళ్లను గతంలో బ్లాక్ చేశారు కూడా. ఇప్పుడు అలాంటి చాన్స్ లేదు. ఎందుకంటే.. టీడీపీ నేతలు మాక్ అసెంబ్లీని ఆన్ లైన్లో నిర్వహిస్తారు కానీ.. అసెంబ్లీ ప్రాంగణంలో కాదు.