గ్రూప్స్ పరీక్షలకు ఇలా నోటిఫికేషన్ రాగానే అలా తెలంగాణలో కొత్త వివాదాలు ప్రారంభమయ్యాయి. దీనికి ప్రభుత్వమే చాయిస్ ఇచ్చింది.దాన్ని బీజేపీ నేతలు అందుకున్నారు. గ్రూప్స్ పరీక్షల్లో ఇంటర్యూలు ఎత్తేశారు. రాతపరీక్ష ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం హఠాత్తుగా ఓ జీవో ఇచ్చింది. దాని ప్రకారం ఇప్పటి వరకూ తెలుగు , ఇంగ్లిష్‌లలో మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉండగా.,.. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉర్దూలోనూ పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఉర్దూలో పరీక్షలు వాళ్లే రాస్తారు… పేపర్లు వాళ్లే దిద్దుకుంటారు.. ఉద్యోగాలు కూడా వాళ్లకే వస్తాయని.. మిగిలిన వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు ప్రారంభించారు.
గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఉర్దూలో పరీక్ష రాయడానికి అనుమతించడం ఉద్యోగాలన్నీ ఒక వర్గానికి కట్టబెట్టడమేనని బండి సంజయ్ కూడాఆరోపించారు. ఇది టీఆర్ ఎస్ మతత్వవాదానికి అతిపెద్ద ఉదాహరణ. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఉర్దూలో పరీక్షరాసేదానికి అవకాశం కల్పించడాన్ని మత రాజకీయాలకు ముడిపెట్టడంతో.. టీఆర్ఎస్ మండి పడింది.. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు లేదా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే హక్కు భారత పౌరులకు ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీజేపీ ఎంపీలు యువతను రెచ్చగొట్టే విధంగా, విద్వేషాలకు పెంపొందించేందుకుకుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయడం గురించి కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించారని ఆధారాలు చూపిస్తున్నారు. అయితే బీజేపీ నేతల రాజకీయానికి ఇంతకు మించి గొప్ప అస్త్రం దొరకదు. అందుకే వారు ఈ వివాదాన్ని పరీక్షల వరకూ కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.