తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేసుకుంది. రెండు వారాల్లో ఎన్నికల తేదీల ప్రకటన ఉంటుందని ముందుగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనలు .. బాంబుల ప్రకటనల్లాగే తుస్సుమన్నాయి. సీఎం రేవంత్ తో పాటు ముఖ్య నేతలు, అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం అయ్యారు. ఎన్నికల తేదీలపై ఓ క్లారిటీ వస్తుందనుకున్నారు. కానీ సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మరోసారి కులగణన చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో అందరూ షాక్కు గురి కావాల్సి వచ్చింది.
కులగణన చాలా పక్కాగా జరిగిందని ప్రభుత్వం అదే పనిగా వాదిస్తోంది. అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకుంది కూడా. ఆ నివేదిక ఆధారంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కూడా సమర్పించింది. ఇప్పుడు మళ్లీ రీ సర్వే అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేక విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది. కులగణన తప్పుల తడక అని తాము వాదించామని ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకుని మళ్లీ సర్వే చేస్తోందని ఇతర పార్టీలు వాదిస్తాయి. అయితే ప్రభుత్వం గతంలో కులగణనలో నమోదు చేసుకున్న వారికి మాత్రం కాదని.. మొత్తంగా 3.1 శాతం మంది నమోదు చేసుకోలేదని వారి కోసమేనని చెబుతోంది.
అయితే ఇప్పుడు డబుల్ ఎంట్రీలు నమోదు చేయించుకుంటే పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలన్న రూల్ ఏమీ పెట్టుకోలేదు. ఫలితంగా నమోదు చేసుకున్న వారు.. చేసుకోని వారు ఎవరో అంచనా వేయడం కష్టమే. ఈ వ్యవహారం మరింత గందరగోళానికి దారి తీసే అవకాశం ఉంది. సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేని వారు. వారు ఇప్పుడు మళ్లీ సర్వే పెట్టినా వివరాలు ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది.
బీసీ డిక్లరేషన్ ప్రకటించి స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీనే ఇప్పుడు కాంగ్రెస్ కు సమస్యగా మారింది. రాజకీయంగా ఆ రిజర్వేషన్లు ఇద్దామని రేవంత్ సవాల్ చేశారు కానీ.. అలా ముందుకు వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని.. మరో ప్రయత్నం చేద్దామని వాయిదా వేస్తున్నారు. గత ఏడాది నుంచి ..స్థానిక ఎన్నికలను రేవంత్ సర్కార్ ముందుకు జరుపుకుంటూ పోతోంది.