ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సిద్ధమయిందని.. ఆరుగురికి ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయని ఆశావహులు పండుగ చేసుకుంటున్న సమయంలో కేసీఆర్ వారందరికీ పిడుగులాంటి వార్త పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడల్లా సాధ్యం కాదని నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాశారు. దీనికి కారణం కరోనానే చూపించారు . రోజుకు ఆరు వందల కేసులు నమోదవుతున్నాయని ఇంకా.. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని… ఈసీకీ తెలంగాణ సర్కార్ తెలిపింది. దీంతో అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడల్లా జరిగే చాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఆరు స్థానాలు ఖాళీ అయి.. రెండు నెలలు అవుతోంది. అప్పట్లో కరోనాకారణంగా ఈసీనే వాయిదా వేసింది.
ఇప్పుడు.. ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉన్నా.. తెలంగాణ సర్కార్ వద్దంటోంది. అయితే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు వద్దనుకోవడానికి కారణం కరోనా కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆశావహులందర్నీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు కాబట్టి.. ఎవరూ అసంతృప్తికి గురి కాకుండా చేయడానికేనని అంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఆరు ఎమ్మెల్సీ సీట్లకు… ఇరవై మంది వరకూ పోటీ పడుతున్నారు. చాన్స్ రాని వాళ్లు… హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని.. కేసీఆర్ అంచనా వేసినట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన పదవుల భర్తీని వాయిదా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
నిజానికి అవి ఎమ్మెల్యే కోటా ఎన్నికలు. అన్నీ ఏకగ్రీవంగా పూర్తవుతాయి. ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉండదు. అయినా అదేదో కరోనా వ్యాప్తి ఈవెంట్ అన్నట్లుగా కేసీఆర్ కలరింగ్ ఇచ్చి ఎన్నికల వాయిదాకు నిర్ణయించడం… కొంత మందిని ఆశ్చర్య పరుస్తోంది. హుజూరాబాద్ ఎన్నిక పెట్టాలనుకుంటే… వద్దని ఈసీకి సందేశం పంపడం కూడా ఇందులో ఇమిడి ఉందని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్.. ఏ విషయాన్నైనా రాజకీయంగా వాడుకోవడంలో ముందుంటారని రాజకీయ వర్గాలు మరోసారి వ్యాఖ్యానించడం ప్రారంభించాయి.