తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ప్రభుత్వ పెద్దల మెతకదనాన్ని పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. నువ్ బ్యాడ్ అయితే అయామ్ యువర్ డాడ్ అన్నట్లుగా ఆయన దూకుడుగా వెళ్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వలను ఆపాలని కృష్ణాబోర్డు చెప్పినా ఏపీ సర్కార్ నిర్మిస్తోందని.. తాము మాత్రం కృష్ణాబోర్డు ఆదేశాలు ఎందుకు పాటించాలని తెలంగాణ సర్కార్ వాదిస్తూ.. అందుబాటులో ఉన్న కృష్ణా జలాల్ని .. కరెంట్ ఉత్పత్తి కోసం.. విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. నిబంధనలు అనుమతించకపోయినా… కృష్ణాబోర్డు ఆపాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. శ్రీశైలంలో స్వల్ప స్థాయిలో వరద వస్తోంది.
అయితే… వరదతో పాటు డెడ్ స్టోరేజీలో ఇప్పటికే ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీ ఫిర్యాదు మేరకు కృష్ణాబోర్డు.. కరెంట్ ఉత్పత్తి ఆపాలని లేఖ పంపినా పట్టించుకోవడం లేదు. ఒక్క శ్రీశైలంతోనే సరిపెట్టుకోలేదు. నాగార్జున సాగర్‌లోనూ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరిస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు పవర్ హౌస్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు ఏపీలో ఉంది. పవర్ హౌస్ తెలంగాణ భూభాగంలో ఉంది. పులిచింతలలో ఉండే నీరు కృష్ణాడెల్టాకు ఎంతో ముఖ్యం. ఈ నీటి ద్వారా సుమారు 30మెగావాట్ల విద్యుదుత్పాదన చేస్తున్నారు. అంటే..వారంలో అది ఖాళీ అయిపోతుంది.
వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పవర్ హౌస్ వద్ద పూర్తిస్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. డెడ్ స్టోరేజీ నుంచి నీటిని విద్యుత్ కోసం వాడుకోవడంతో.. కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. కృష్ణాబోర్డును ధిక్కరించడం ఏమిటని మంత్రులు.. ప్రశ్నిస్తున్నారు.. లేఖలు రాస్తున్నామని చెబుతున్నారు కానీ.. సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదు. తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించడం లేదు. అటూ ఇటూ తిరిగి చివరికి ఏపీ ప్రజలకే జల గండం వచ్చి పడే పరిస్థితి కనిపిస్తోంది.