వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ఆ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేసింది. దాన్ని కొనసాగించింది. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో సినిమాను మరో మూడు వారాల పాటు విడుదల చేసే అవకాశం లేదు. ఆ తర్వాత జరిగే విచారణలో .. రివైజింగ్ కమిటీ ఇచ్చే నిర్ణయం మేరకు తీర్పు చెబుతారు. అయితే అప్పటికే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. రిలీజ్ చేయడానికి ఉండదు. ఎన్నికల షెడ్యూల్ ఉంటే.. అలాంటి ప్రాపగాండా సినిమాలను రిలీజ్ చేయనివ్వరు. ఎన్నికల తర్వాతే ఇక సినిమా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారితే రామ్ గోపాల్ వర్మ తెలుగురాష్ట్రాల్లో ఉండలేరు. ఆజ్ఞాతంలోకి పోవాల్సిందే. గతంలోలా చూసి చూడనట్లుగా ఉండే పరిస్థితులు వచ్చే సారి ఉండవు.
అందుకే వ్యూహం సినిమా వెలుగులోకి వస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత కరవవుతోంది. ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అసలు వ్యూహం లోకేష్ దేనని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాకు సీబీఎఫ్సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని లోకేష్ సవాల్ చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందని అనుకుంటే, తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని నిర్మాత తరఫు లాయర్ కోరారు. దీనిపై నారా లోకేశ్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి మరోసారి రివిజన్ కు వెళ్లింది.