తానా బృందావనంలో సాహితీ కుసుమాలు విరబూయబోతున్నాయి. తెలుగు సాంస్కృతిక వైభవాన్ని చాటానున్నాయి.
సతీష్ వేమన సారధ్యంలో జులై 4-6 వరకూ వాషింగ్టన్ డీసీ వేదికపై జరిగే 22వ తానా మహా సభలు తెలుగు సాహితీ వికాసాన్ని కొత్త తరానికి వివరించబోతున్నాయి (Telugu poets in modern times). తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సాహితీమూర్తులను ఆహ్వానించి సత్కరించడంతోబాటు.. విభిన్న సాహితీ ప్రక్రియలతో రూపొందించిన కార్యక్రమాలతో తెలుగు వెలుగులు వెదజల్ల బోతున్నాయి.
తెలుగువారికే సొంతమైన సాహితీ ప్రక్రియ అవధానం. పంచ సహస్రావధానం చేసిన సరస్వతీ పుత్రులు డా.మేడసాని మోహన్ గారి అవధాన కార్యక్రమానికి 22వ తానా మహా సభలు వేదికవుతాయి. సాహితీ అభిమానులను సమ్మోహనపరుస్తాయి (Telugu Heritage).
ప్రముఖ సాహితీవేత్త, వివిధ దేశాల్లో తెలుగు సాంసృతిక రాయబారిగా వ్యవహరించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు తానా మహా సభలకు విశిష్ట అతిథిగా విచ్చేస్తారు. ఎందరో తెలంగాణ యువ రచయితలకు ‘దివిటీ’లా నిలిచారు నందిని సిద్దారెడ్డి. తెలంగాణా సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులుగా తనదైన ముద్ర వేసిన సిద్దారెడ్డి గారు తానా మహాసభల్లో స్ఫూర్తిదాయక ప్రసంగం చేస్తారు. నాగేటి చాలల్లా తన అనుభవాలను పంచుకుంటారు. తానా మహాసభలకు విచ్చేస్తున్న మరో ముఖ్య అతిథి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్.
శాతావధాని అయిన పాలపర్తి, తానా మహా సభల్లో తన అవధాన కార్యక్రమంతో అలరిస్తారు. తానా సత్కారాన్ని అందుకోబోతున్నారు. ఆకాశంలోనే కాదు, సాహిత్యంలోనూ మహిళలు సగం. అందుకే తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన వాణి కుమారి తుమ్మలపల్లి, డా.కె.ఎన్. మల్లీశ్వరిలను తానా సత్కరించాలని సంకల్పించింది..
వెన్నెల పైటేసి విశ్వనాధ పలుకులు విరుల తేనె చినుకులతో కూనలమ్మ కులుకులు కూచిపూడి నడకలతో పచ్చని చేల పావడ గట్టీ కొండమల్లెలు కొప్పునబెట్టి దొరసాని వన్నెల కిన్నెరసాని ని ఖండతరాలు దాటించి మన తాన కు తీసుకు రాబోతున్నారు దర్శకులు వంశీ. తెలుగు సినిమాతో తానా అనుబంధం ఈనాటిది కాదు. (filmmakers in Telugu).
22వ తానా మహా సభల్లో సినీ కవి జొన్నవిత్తుల, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా కానున్నారు. ఇక తెలుగు సినిమాకి బాహుబలిని, హిందీ సినిమాకి భాయీజాన్ అందించిన విజయేంద్ర ప్రసాద్ ను తానా సత్కరిస్తుంది. జయీభవ అని అభినందిస్తుంది.
ఇలా 22వ తానా మహాసభలు విశ్వ వేదికపై చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అని నినదించబోతున్నాయి. తెలుగు పదం..జానపదం..కథ..నవల..సినిమా..అవధాన వైశిష్ట్యాన్ని సగర్వంగా చాటబోతున్నాయి.
ఇంతవరకూ అక్షరాల్లోనే ఊరించిన నవలా దేవర 22వ తానా సభల్లో కనిపించనున్నారు. ప్రముఖ నవలా రచయిత సూర్యదేవర రామ్మోహనరావు తానా మహా సభల్లో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.
ఇంకా కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ ఆర్బీ నాయుడు తానా మహా సభలకు విచ్చేసి ప్రసంగిస్తారు.
సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ తన లలిత గీతాలతో అలరిస్తారు. ప్రముఖ రచయిత వాసిరెడ్డి నవీన్ తెలుగు కథా గమనాన్ని వివరిస్తారు.
ఇలాంటి మరెన్నో పసందైన కార్యక్రమాలతో, ఆటపాటలతో మీరు మెచ్చేలా, మనసుకు నచ్చేలా కార్యక్రమాలను తిలకించాలంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోరడి.
ఇతర వివరాలకు తానా కాన్ఫరెన్స్ వెబ్సైట్ను www.TANA2019.org చూడండి.
Press release by: Indian Clicks, LLC