తెలుగు రాష్ట్రాలకు నీళ్లపై హక్కుల్ని శాశ్వతంగా కోల్పోయాయి. ఇప్పుడు మొత్తం కేంద్రం చేతిలో పెత్తనం ఉంది. అక్రమ ప్రాజెక్టుల పేరుతో గొడవలు పడిన తెలుగు రాష్ట్రాల పరిస్థితిని.. కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ రాసిన లేఖను అడ్డం పెట్టుకుని కేంద్రం.. ఏకంగా కృష్ణా, గోదావరీ నది పరిధిలోని 107 ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంది. చివరికి ప్రకాశం బ్యారేజీ కూడా కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లిందంటే… ఇక నదులపై సర్వహక్కులు… కేంద్రం బోర్డులకు అప్పగించేసిందన్నమాట. ఇప్పుడు.. ఒక్క చుక్క నీరు కూడా… సొంతంగా వాడుకోవడానికి లేదు. ఏదైనా బోర్డు కేటాయించాల్సిందే. వారు విడుదల చేయాల్సిందే.
కృష్ణా, గోదావరి బోర్డులకు సర్వాధికారాలు అప్పగించిన కేంద్రం… ఖర్చుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై రుద్దింది.అంటే.. పూర్తి స్థాయిలో ఖర్చులు భరించి మరీ.. తమ కృష్ణా జలాలపై హక్కుల్ని కేంద్రానికి దఖలు పర్చుకున్నారన్నమాట. ఇప్పుడు.. ఒక్క టీఎంసీ నీరు అవసరం అయితే విడుదల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బతిమాలుకోవాల్సి ఉంటుంది. బోర్డుల వద్దకు పరుగెత్తాల్సి ఉంటుంది. ఆ బోర్డులు.. ఎలా పని చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర అన్ని కేంద్ర ప్రభుత్వ బోర్డుల్లానే “నిబంధనల” ప్రకారం పని చేస్తాయి. పైగా ఆ బోర్డుల్లో తెలుగు వారెవరరూ ఉండరు. రాష్ట్రాలకు సంబంధించిన ఇతర రాష్ట్రాల క్యాడర్ అధికారులు కూడా ఉండరు. మొత్తంగా రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని వారే బోర్డుల్లో ఉంటారు. వారికి ఇక్కడ సమస్యలు తెలియవు. వారికి ఇచ్చిన రూల్స్ మాత్రం వారు ఫాలో అవుతారు.
రాజకీయం కోసమో… మరో కారణం కోసమో కానీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య ను… పెంచి పెద్దది చేసుకుంటూ వెళ్లారు. ఈ పరిస్థితిని కేంద్రం అనుకూలంగా మార్చుకుంది. రాష్ట్రాల అధికారాలను లాగేసుకుంది. ఇప్పుడు…రెండు రాష్ట్రాలకూ ఈ బోర్డులు షాక్‌లా తగిలింది. అయితే… బోర్డులు ఏర్పాటు చేయాలని ఏపీనే కోరింది కాబట్టి స్వాగతించక తప్పని పరిస్థితి ఉంది. అయితే అన్ని ప్రాజెక్టచులను చేర్చడం.. ఏపీకి కూడా షాకే. అందుకే మార్పులు కోరాలని భావిస్తోంది. కానీ.. అలాంటి ప్రతిపాదనలతో కేంద్రం వద్దకు వెళ్తే… అక్కడ పరాభవం ఎదురవడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఇక తెలంగాణ ఈ బోర్డులను నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. అవసరం అయితే న్యాయపోరాటం చేయాలని అనుకుంటోంది. కానీ.. ఎవరేం చేసినా.. విభజన చట్టం ప్రకారం…బోర్డుల్ని నోటిఫై చేసినందున కోర్టుల్లో కూడా నిలవదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలు… అత్యంత కీలకమైన హక్కు అయిన నీళ్లపై పూర్తి హక్కులను కోల్పోయాయి. ఇప్పుడు చేయడానికేం లేదు. ఏ చిన్న అవసరం వచ్చినా.. నీళ్లు కావాలి అంటూ… కేంద్రం అధీనంలో ఉన్న కృష్ణా, గోదావరి బోర్డుల వద్దకు పరుగెత్తాలి. అంతేనా… ఏటా రూ. నాలుగు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు అంతకు మించి వేరే దారి లేదు.