జై భీం అనే సినిమాలో హీరో సూర్య క్యారెక్టర్‌కు ఆయనే స్ఫూర్తి అంటూ.., రకరకాల ప్రచారాలు తెలుగునాట కూడా పొందిన జస్టిస్ చంద్రు ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఆయన మానవహక్కులకు సంబంధించిన ఓ సభలో ప్రసంగించేందుకు వచ్చి … ఏపీలో అధికార దాడులకు, పోలీసుల ఆకృత్యాలకు బలైపోయిన వారెవరి గురించి ఆయన చెప్పకుండా వారి హక్కులను కాపాడుతున్న హైకోర్టుపై ఆయన పరుషమైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు నిర్ణయాలనే తప్పు పట్టారు. ఇప్పటికే ఏపీ హైకోర్టును టార్గెట్ చేసి అనేక రకాల దుష్ప్రచారాలు, న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించిన వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉండగా.., తాజాగా జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ హైకోర్టు దృష్టికి కూడా వెళ్లాయి.
న్యాయమూర్తులపై దూషణల కేసు విచారణకు వచ్చిన సందర్భంలో జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం స్పందించింది. మానవ హక్కులకు సంబంధించిన అంశంపై మాట్లాడడానికి వచ్చారు కాబట్టి.. విశాఖలో ఓ డాక్టర్‌ను రోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని విశాఖ వెళ్లి మంచి డైరక్టర్‌ను చూసి సినిమా తీయించాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సలహా ఇచ్చారు. న్యాయవ్యవస్థను కించపరచడం.. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించడంపై సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. న్యాయమూర్తులుగా పని చేసి రిటైరైన తర్వాత మీడియాలో లైమ్ లైట్లోకి రావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారి లైట్స్ ఆపేస్తామని చీఫ్ జస్టిస్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు.
ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు అంశాలను చూపించి మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా? అని జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు.
ఏపీలో ఎన్నో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. కానీ జస్టిస్ చంద్రు ఒక్కటంటే ఒక్కదాన్ని ఉదహరించలేదు. అంతేకాదు అమరావతికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో అవాస్తవాలతో ఆయన ఓ కథనం రాశారు. అందులో భూములిచ్చినరైతులే తిరుగుబాటు చేశారని.. తీసుకోకుండా ఉద్యమం చేస్తున్నారని రాశారు. ఇలాంటి వాటితో ఆయనకు పూర్తిసమాచారం ఇవ్వకుండా.. ఉద్దేశపూర్వకంగా కొంత మంది ఆయన ఇమేజ్ను ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన సలహా మేరకు విశాఖకు వెళ్లి డాక్టర్ సుధాకర్ అంశంపైనా సినిమా తీయించేందుకు ప్రయత్నిస్తారేమోచూడాలి. ఎంతో వేధింపులకు గురైన సుధాకర్ చనిపోయారు. ఆయన చనిపోయిన విషయం అంత్యక్రియలు అయిపోయిన తర్వాతే బయటకు తెలిసింది.