టాలీవుడ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టే ప్రశ్నే లేదన్నట్లుగా వెంటాడుతున్న ఏపీ ప్రభుత్వం జీవో నెం.35పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. స్వయంగా అడ్వకేట్ జనరలే రంగంలోకి దిగి తక్షణమే విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు. లేకపోతే టిక్కెట్ రేట్లు పెంచేసుకుని అమ్మేసుకుంటారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం పుష్ప సినిమా రిలీజ్ కానుంది.
టిక్కెట్ రేట్ల వివాదం ఉండటంతో ఎంత రేటుకు అమ్మాలన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో ఇంకా బుక్కింగ్స్ ఓపెన్ చేయలేదు. హైకోర్టు తీర్పు తర్వాత డిస్ట్రిబ్యూటర్లు రేట్లు పెంచి అమ్మడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో అక్కడ ఏమి నిర్ణయం వస్తుందోనన్న టెన్షన్ ప్రారంభమయింది. విచారణ ప్రారంభమయ్యే సమయానికి సింగిల్ బెంచ్ ఇచ్చినతీర్పు పూర్తి పాఠం అందలేదు. దీంతో ధర్మాసనం గురివారం విచారణ జరుపుతామని ప్రకటించారు.
ఆలస్యం అయితే టిక్కెట్లు అమ్మేసుకుంటారని వెంటనే విచారణ చేపట్టాలని ఏజీ పట్టుబట్టడంతో గురువారం మొదటికేసుగా విచారణ జరుపుతామని ధర్మాసనం హామీ ఇచ్చింది. ఒక వేళ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇస్తే పుష్పతో పాటు ఇతర పెద్ద సినిమాలకు పెద్ద పంచరే పడుతుంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే మాత్రం.. ఇక కలెక్షన్లకు మాత్రం ఇబ్బంది ఉండకపోవచ్చు.