కేంద్రంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తాము అలుపెరుగని పోరాటం చేస్తున్నామని జగన్ అన్నారు. దీంతో టీడీపీతోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దిగి రావాల్సి వచ్చిందన్నారు. రాజకీయంగా ముందగుడు వేసే మేరే మార్గం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి వైకాపాను టీడీపీ అనుసరించాల్సి వచ్చిందన్నారు. ఇది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం అని జగన్ చెప్పారు. అంతేకాదు, ఇది ప్రజాస్వామ్య విజయమనీ అన్నారు. ప్రత్యేక హోదా, ఏపీ హక్కుల సాధన కోసం పోరాటం చేయడంలో వైకాపా ఎప్పటికీ ముందుంటుందని చెప్పారు.
టీడీపీ అవిశ్వాసంపై జగన్ నుంచి ఇలాంటి స్పందనే వస్తుందని ఊహించిందే..! ఎందుకంటే, ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్రాన్ని టీడీపీ నిలదీయడం మొదలుపెట్టినప్పుడే.. వైకాపా ఇలా స్పందించింది. తాము నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామనీ, ఇప్పుడు టీడీపీ తమదారిలోకి వచ్చిందనీ అన్నారు. హోదాకి బదులుగా ప్యాకేజీ ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వపోయేసరికి కేంద్రంపై టీడీపీ పోరాటం మొదలుపెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. అధికార పార్టీ పోరాటంలోనే తమ నాలుగేళ్ల పోరాట ఫలితాన్ని వెతుక్కుని, ప్రజలకు వైకాపా చూపిస్తున్నట్టుగా ఉంది..! నిజానికి, గడచిన నాలుగేళ్లలో వైకాపా పోరాటాలూ ఉద్యమాలూ భాజపాను స్పందింపజేసే స్థాయికి చేరుకున్న సందర్భాలు లేవు. ఇప్పటికీ భాజపాని తీవ్రంగా విమర్శించిన పరిస్థితే లేదక్కడ.
కేంద్రంపై టీడీపీ పోరాటం మొదలుపెట్టాకే దాన్ని వైకాపా అనుసరించడం మొదలుపెట్టింది. పార్లమెంటులో టీడీపీ నేతలు ఆందోళనలు చేయడం ప్రారంభించాకనే… కేంద్రంపై అవిశ్వాస తీర్మానం అంటూ జగన్ ప్రకటించారు. ఇంతవరకూ నేరుగా కేంద్రంపై జగన్ విమర్శలు చేసిందే లేదు. ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి, తెచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రమే జగన్ పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలో భాజపాతో వారు ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనాలేంటో ప్రజలకు అర్థమౌతూనే ఉన్నాయి. ఇక, ఇప్పుడు కూడా టీడీపీ అవిశ్వాసం అంటుంటే.. దాన్ని తమ విజయంగా, ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా జగన్ చెబుతున్నారు. ఇక్కడ కూడా తమ రాజకీయ లబ్ధి బుద్ధినే జగన్ బయటపెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే సంకట స్థితిలో ఉన్న ఈ తరుణంలో ఇలా విజయాలను వెతుక్కోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ప్రజలు ఆవేదనతో ఉన్నారు.. ఇక్కడ విజయం ఎక్కడుంది..? ఈ పోరాటంలో ఎవరు ముందున్నారనే రేస్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా..?