పెట్రో పన్నులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ఎంత.. రాష్ట్రం ఎంత వసూలు చేస్తుందో స్పష్టమైన లెక్కలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం రెండు సార్లు భారీగా పెట్రో ధరలు తగ్గించింది. కేంద్రంతో పాటుగా చాలా రాష్ట్రాలు పన్నులను తగ్గించి ప్రజలకు ఊరటనిస్తున్నాయి. మళ్లీ పెరిగేవే కదా అని ఊసురుమంటున్నప్పటికీ.. ఎంతో కొంత తగ్గుతోంది కదా అని చాలా మంది సంతృప్తి పడుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం అసలు ప్రజలకు రిలీఫ్ ఇచ్చేందుంకు సిద్ధపడటం లేదు.
తాజాగా కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా… ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కూడా తగ్గిస్తున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర బీజేపీ రాష్ట్రాలు కూడా అదే తరహా ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో అందరి చూపు తెలుగు రాష్ట్రాలపైనే పడుతోంది. తాజాగా తగ్గింపులతో దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్న రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణ నిలుస్తున్నాయి.
ప్రాథమికంగా అయితే పెట్రో పన్నుల తగ్గింపు అనే ఆలోచనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేదు. రోడ్లకు కనీస మరమ్మతులు చేయకపోయినా రోడ్ సెస్ వేసి ప్రజల దగ్గర పిండేసుకుంటున్న ఏపీ ప్రభుత్వం వాటిని తగ్గించడానికి కూడా ఏ మాత్రం సిద్ధంగా లేదు. కావాలంటే ఇంకొంత వడ్డించి ఆదాయం పెంచుకుంటామన్న పద్దతిలో వారు ఉన్నారు. తెలంగాణసర్కార్ కూడా అంతే. తాము పెంచలేదని వాదిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం రాజకీయ వాదనలు ఎలా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా తగ్గింపును కోరుకుంటున్నారు. లేకపోతే.. వారిలో అసంతృప్తి పెరిగిపోయే ప్రమాదం ఉంది.