The Warriorr Movie Telugu Review
రేటింగ్: 2.5/5
కరోనా సంక్షోభం తర్వాత కూడా మన బాక్సాఫీసుకి వందల కోట్లు వసూలు చేసే స్టామినా ఉందని కొన్ని సినిమాలు చాటి చెప్పాయి. అయితే విచిత్రంగా ఆ సినిమాల తర్వాత మళ్లీ బాక్సాఫీసు కోలుకోనేలేదు. సరిగ్గా ఏడు వారాలైంది థియేటర్ల దగ్గర అసలు సిసలు సందడి కనిపించి. ఈమధ్య వచ్చిన సినిమా వచ్చినట్టే వెళ్లిపోతుంది. విడుదలైన తొలి రోజు నాలుగు ఆటలు కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించడం లేదు. సరైన కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు థియేటర్లకి తప్పకుండా వస్తారనే భరోసాతో సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ శుక్రవారం రామ్ పోతినేని సినిమా విడుదలైంది. రామ్ – లింగుస్వామి – దేవిశ్రీప్రసాద్… ఈ కాంబినేషనే ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇక ఈ సినిమాతో రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో నటించడం, ఇది తమిళంలోనూ రూపొందడం వంటి విషయాలు సినిమాపై మరిన్ని అంచనాల్ని రేకెత్తించాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…
కర్నూలులో వినిపించాల్సింది తన ఒక్కడి పేరే అంటాడు గురు (ఆది పినిశెట్టి). నిక్కర్ వేసుకునే సమయంలోనే తల్లి చెప్పిందని శత్రువు తల నరికి కొండారెడ్డి బురుజు దగ్గర నిలుచుంటాడు. ఇక అతను పెరిగి పెద్దవాడైతే? గురు తన భయంతోనే కర్నూలుని శాసిస్తుంటాడు. ఎక్కడైనా తన మాటే చెల్లుబాటవుతుంది. అలాంటి ఊళ్లోకి ఓ ఐపీఎస్ అడుగు పెడతాడు. గురు కోసమే అతను ఆ ఊళ్లోకి దిగుతాడు. డీఎస్పీగా ఛార్జ్ తీసుకుంటాడు. ఆ తర్వాత అసలు ఆట మొదలవుతుంది. పేరు చెబితేనే భయం వేసేంత బలవంతుడైన గురుని సత్య ఎలా ఎదిరించాడు? అతను ఆ ఊరికే పోస్ట్ వేయించుకోవడానికి కారణమేమిటి? అంతకుముందు గురుతో అతనికి ఎలాంటి శత్రుత్వం ఉంది? ఇంతకీ సత్య గతమేమిటి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.
చాలా పోలీస్ కథలు విన్నాక దీన్ని ఎంచుకున్నానని రామ్ పోతినేని పలు వేడుకల్లో చెప్పారు. తన పాత్ర పోలీస్‌గా మారే క్రమం కొత్తగా ఉండొచ్చు కానీ, ఈ కథకి ఇచ్చిన మిగతా ట్రీట్మెంట్ అంతా పాతదే. ఇదివరకు చాలా సినిమాల్లో చూసిందే. పోలీస్ కథలు ఎప్పుడైనా ఎత్తుకు పైఎత్తులు, ఊహించని మలుపులతో సాగాలి. ఆ కథల్లో వేగంతోపాటు, తగినంత డ్రామా కూడా ఉండాలి. ఈ సినిమా విషయంలో అవే లోపించాయి. సత్య… ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తి ఆరంభ సన్నివేశాల్లో రేకెత్తుతుంది కానీ, ఆ తర్వాత ప్రేక్షకుడికే సులభంగా అర్థమవుతుంది. ఇక అప్పట్నుంచి ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతుంది. అదే ఈ సినిమాకి మైనస్. మరి లింగుస్వామి తరహా అంశాలు లేవా అంటే ఉన్నాయి. ప్రథమార్థం సినిమాని మాస్‌కి తగ్గట్టుగా మలిచాడు. అక్కడక్కడా చిన్న మలుపులతో షాక్ ఇస్తాడు. కానీ అవి సినిమాకి సరిపోవు. కొత్త అభిరుచులతో మారిపోయిన నేటి ప్రేక్షకుడికి చాలవు. అటెన్షన్ ప్లీజ్ అంటూ మాటి మాటికీ గుర్తు చేస్తూ కథలోకి తీసుకెళతున్నా అనే విషయాన్ని గుర్తు చేస్తుంటాడు కానీ, అవి పాత పోలీస్ సినిమాల్నే గుర్తు చేస్తాయి తప్ప కొత్తదనం కనిపించదు.
కథని రామ్ – కృతిశెట్టి మధ్య లవ్ ట్రాక్‌తో మొదలు పెట్టాడు దర్శకుడు. ఆ సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. గురు ఎంట్రీ ఇచ్చాక సినిమా వేగం పుంజుకుంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. అసలు కథ ద్వితీయార్థంలో ఉంటుందేమో అని ఊహించి సీట్లో సెటిల్ అయిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. గురు వర్సెస్ సత్య అన్నట్టుగానే ద్వితీయార్థం మొదలవుతుంది. మెజారిటీ సన్నివేశాలు వాళ్లిద్దరి మధ్యే సాగుతాయి.కానీ డ్రామా మాత్రం పండలేదు. గురుపై కంప్లైంట్ ఇవ్వడానికి ఎవ్వరూ రాని క్రమంలో ఓ అబ్బాయి ముందుకు రావడం, అతని కథ ఆసక్తిగా అనిపించడంతో సినిమా దారిలో పడినట్టే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత సన్నివేశాలు మరీ చప్పగా అనిపిస్తాయి. అంత బలవంతుడైన గురు నామినేషన్ వేయడానికి వెళుతున్నప్పుడు అడ్డుకుని ఏమాత్రం ప్రతిఘటన లేకుండా పోలీస్ స్టేషన్‌కి తీసుకురావడం అంతగా మెప్పించదు. ఆ తర్వాత సన్నివేశాల్లోనూ మైండ్ గేమ్ అంటూ ఏమీ ఉండదు. కమర్షియల్ అంశాలకోసమని సీరియస్‌గా సాగే పోలీస్, రౌడీ మధ్య వార్‌లోకి కూడా లవ్ట్రాక్ని చొప్పించడం అతకలేదు.
రామ్ పోతినేని, ఆది పాత్రలు సినిమాకి ప్రధానబలం. వారిద్దరే సినిమాని నడిపించారు. రామ్ రెండు కోణాల్లో సాగే పాత్రలోకనిపిస్తాడు. రెండింటిలోనూ వేరియేషన్ చూపించాడు. తనదైన ఎనర్జీని చూపిస్తూ డ్యాన్స్‌లు, ఫైట్లతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆది పినిశెట్టి చేసిన గురు పాత్ర సినిమాకి కీలకం. ఫెరోషియస్‌గా కనిపిస్తూ పాత్రపై తనదైన ముద్ర వేశాడు. ఆది పినిశెట్టి కాకపోతే ఆ పాత్ర అంత బాగా పండేది కాదేమో అనిపిస్తుంది. విజిల్ మహాలక్ష్మిగా కృతి అందంగా కనిపించింది. పాటల్లో రామ్‌కి దీటుగా ఆడిపాడింది. జేపీ, నదియా, పోసాని తదిదతరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్‌గా సినిమా ఓకే. ఎడిటింగ్, సంగీతం పెద్దగా ప్రభావం చూపించలేదు. డీఎస్పీ పాటలవరకు ఓకే కానీ, నేపథ్య సంగీతం పోలీస్కథలకి తగ్గ స్థాయిలో లేదు. నిర్మాణం బాగుంది. మాటలు బాగున్నాయి. దర్శకుడు లింగుస్వామి ఓ సాధారణ కథని, అంతే సాదాసీదాగా చెప్పే ప్రయత్నం చేశాడు. చివరిగా చెప్పాలంటే… ఐపీఎస్ సత్య చేసిన ఆపరేషన్ సక్సెస్… ప్రేక్షకుడి పరిస్థితే!
రేటింగ్: 2.5/5