హైదరాబాద్: దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రాలపై వరల్డ్ బ్యాంక్ రూపొందించిన జాబితాలో ఏపీకి రెండో స్థానం దక్కటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏపీకి ఈ ఘనత దక్కటంపై ఆ రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, ఈ నివేదిక విశ్వసనీయతపై తెలంగాణలోని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రపంచ బ్యాంక్ పెద్దపీట వేసిందని, జార్ఘండ్, ఛత్తీస్గఢ్వంటి నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకు తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకంటే మెరుగైన ర్యాంకింగ్ దక్కటమేమిటని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ నివేదికను వరల్డ్ బ్యాంక్ రూపొందించిందా, ఎన్డీఏ రూపొందించిందా అని సందేహం కలుగుతోందని అంటున్నారు. లక్షలమంది వృత్తి నిపుణులతోకూడిన హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉందని, టీఎస్-ఐపాస్ అనే అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిందని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇవాళ వ్యాఖ్యానించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ), అంతర్జాతీయ కన్సల్టెన్సీ కేపీఎమ్‌జీ, వాణిజ్య మండళ్ళు సీఐఐ, ఫిక్కీలతో కలిసి ప్రపంచ బ్యాంక్ ఈ జాబితాను తయారు చేసింది. వ్యాపారాల ప్రారంభం, భూకేటాయింపులు, కార్మిక చట్టాల సంస్కరణలు, పర్యావరణ అనుమతుల మంజూరు, మాలిక వసతులతోబాటు మొత్తం 8 అంశాల ఆధారంగా వరల్డ్ బ్యాంక్ తొలిసారిగా ఈ లిస్ట్ రూపొందించింది.
పొడవైన సముద్రతీరం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నంవంటి రేవులు, మంచి సహజ వనరులు, భూమి లభ్యతవంటి అంశాలు ఏపీ టాప్ 2 లోకి రావటానికి కారణమై ఉండొచ్చని ఒక వాదన వినిపిస్తోంది. అయితే నిపుణులు హైదరాబాద్‌లోనే ఎక్కువమంది ఉన్నారన్నదికూడా నిజమే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హస్తినలో తన పలుకుబడి ఉపయోగించి ఈ నివేదికను మేనిప్యులేట్ చేయించి ఉంటారన్న విమర్శకూడా బలంగానే వినబడుతోంది. మరి ఈ విమర్శలపై, వాదనలపై, ఈ జాబితాను రూపొందించటానికి అనుసరించిన ప్రమాణాలపై వరల్డ్ బ్యాంక్ వారే వివరణ ఇస్తే అందరి సందేహాలు తొలగిపోతాయి.
మరోవైపు ఈ నివేదిక ఆంధ్రప్రదేశ్‌కు మేలుచేయటం ఏమోగానీ, ఇప్పటికిప్పుడుమాత్రం పెద్ద నష్టం కలుగుతుందన్న వాదనకూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి ఇంత అనుకూలంగా ఉంటే మరి ఆ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వవలసిన ఆవశ్యకత ఏముందన్న ప్రశ్న తలెత్తటం సహజమే. ప్రత్యేక హోదా అనేది పేద రాష్ట్రాలకు, బాగా వెనకబడిఉన్న రాష్ట్రాలకు ఇస్తుంటారు. విభజనవలన ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందన్న వాదనకు వరల్డ్ బ్యాంక్ నివేదిక పూర్తి వ్యతిరేకంగా ఉంది. ప్రత్యేకహోదాపై ఏపీ డిమాండ్‌ను కేంద్రం నిరాకరించటానికి, ఇతర రాష్ట్రాలు వ్యతిరేకించటానికి ఈ నివేదిక మంచి నెపవుతుందని కొందరు వాదిస్తున్నారు. ఆ వాదనలోనూ బలం లేకపోలేదు.