వందల కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తారు. కానీ సినిమాకు ఖర్చు పెట్టడం… పైపై హంగుల కోసం అత్యధికంగా ఖర్చుపెడతారు. కానీ కథ ఉండదు.. కథలో సోల్ ఉండదు. అంటే ఆత్మలేని కథతో సినిమాతీస్తారు. తీరా అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే నష్టం ఆ నిర్మాతకే కాదు.. పూర్తిగా ఇండస్ట్రీకి జరుగుతుంది. మరోసారి అలాంటి భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి వేరేవాళ్లు జంకుతారు. అలాంటి పరిస్థితినే క్రికెట్‌కు కల్పించింది అహ్మదాబాద్ స్టేడియం. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా భారీ ఖర్చుతో తీర్చిదిద్ది.. అత్యంత ఆధునిక వసతులతో సిద్ధం చేశారు కానీ.. అసలు క్రికెట్ స్టేడియాని ఆత్మ లాంటి పిచ్‌ను మాత్రం పరమ నాసిరకంగా తయారు చేశారు. టెస్ట్ మ్యాచ్‌కు పనికి రాని పిచ్‌పై తొలి టెస్ట్ ఆడించారు.
ఖరీదైన స్టేడియంలో ఇంత నాసిరకం పిచ్ ఎలా..!?
ఐదు రోజులు సాగాల్సిన టెస్ట్ మ్యాచ్.. రెండు అంటే రెండు రోజులకే ముగిసిపోయింది. ఇంకా చెప్పాలంటే పూర్తి రెండు రోజులు కూడా ఆడలేదు. పిచ్ ఎంత నాసిరకంగా ఉందంటే.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జోయ్ రూట్.. సూపర్ బౌలర్‌గా మారాడు. ఆయన వేసే అతి సాదాసీదా బంతులకు బ్యాటింగ్ చేసే వాళ్లు కిందా మీదా పడ్డారు. వికెట్లు సమర్పించుకున్నారు. సెంచరీలు చేసే జోయ్ రూట్ బౌలింగ్‌లో ఎనిమిది పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడంటే ఆ పిచ్ ఎంత పిచ్చిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో గొప్ప స్టేడియం అని ఊహించుకుని గొప్ప మ్యాచ్‌ను ఆశించిన క్రికెట్ ప్రేమికుల ఆసక్తిని మొత్తం ఈ పిచ్ చంపేసింది. టెస్ట్ క్రికెట్ అంటేనే విరక్తి పుట్టేలా చేసింది.
ప్రత్యర్థి కన్నా బాగా ఆడి గెలిస్తేనే గెలుపు..!
అసలే… ఇన్స్టంట్ క్రికెట్ హవా కారణంగా టెస్ట్ క్రికెట్‌పై ఫ్యాన్స్‌లో మొహం మెత్తుతోందన్న అభిప్రాయాల నడుమ ఇలాంటి పిచ్‌లతో అసలు విరక్తి పుట్టించేలా చేస్తున్నారు.. ఘనత వహించిన క్రికెట్ పాలకులు. ఇండియా గెలవాలంటే ఇలాంటి పిచ్లే తయారు చేయాలనుకుంటే.. ఇక మ్యాచ్‌లు పెట్టాల్సిన పని లేదు. టాస్ వేసి.. ఏది పడినా ఇండియానే గెలిచిందని ప్రకటించేస్తే సరిపోతుంది. ఎన్నికల్లో చేసినట్లుగా.. చేసేసి.. ఇండియాకే గెలుపు ప్రకటిస్తే సరిపోతుంది. కానీ క్రికెట్ లో గెలుపును ఎవరూ అలా కోరుకోరు. ఆడాలి.. కసి తీరా ఆడాలి.. ప్రత్యర్థుల కన్నా బాగా ఆడి గెలవాలి. అదీ ఆట . అంతే కానీ.. పిచ్చి పిచ్‌లతో గెలిపించేసుకుంటామని.. అనుకుంటే.. అది ఆటకే అవమానం. అహ్మదాబాద్ స్టేడియంలో జరిగింది అదే.
ఇలాంటి పిచ్ లు క్రికెట్‌కు భరోసా ఇవ్వలేవు..!
టెస్ట్ క్రికెట్ మళ్లీ పూర్వ వైభవం పొందాలంటే.. ఐదు రోజుల మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాలి. క్రికెట్ మజాను అందించాలి. అంతే కానీ.. ఒకటిన్నర రోజులతో ముగిసే మ్యాచ్‌లు క్రికెట్ ఫీస్ట్ అందించలేవు. అసలు ఇక్కడ విషాదం ఏమిటంటే.. ఇంగ్లాండ్ టూర్లో అత్యధిక మ్యాచ్‌లు ఈ అహ్మదాబాద్ స్టేడియానికే కేటాయించారు. ఇంత దారుణమైన పిచ్‌పై ఇంకెన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారో… క్రికెట్ ఎంతగా పతనం అవుతుందో తలుచుకుంటేనే సాధారణ క్రికెట్ ప్రేమికులు ఆవేదన చెందడం ఖాయం.