ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు అమానవీయంగా ఉంది. టీడీపీ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులు, నీరు – చెట్టు నిధులను నిలిపివేసి.. ఆ పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టామని అని సంతృప్తి పడినా.. ఇప్పుడు కరోనా రోగులకు అన్నం పెట్టిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించకపోవడం చర్చనీయాంశమవుతోంది. వారు కూడా టీడీపీ నేతలేనా అనే నిష్టూరాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైకోర్టులో కరోనా రోగులకు బిల్లులు చెల్లించని అంశంపై పెద్ద ఎత్తున పిటిషన్లు పడ్డాయి. తాము ప్రభుత్వం మాట విని.. రోగుల కడుపు నింపితే.. తమకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ఫుడ్ కాంట్రాక్టర్లు హైకోర్టులో పిటిషన్లు వేసి ఆవేదన చెందుతున్నారు.
సహజంగా ఏ ప్రభుత్వమైనా కాస్తంత మానవత్వంతో ఉటుంది. ఆకలి తీర్చిన వారి బిల్లులు పెండింగ్లో పెట్టదు. కానీ ఈ ప్రభుత్వానికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఎక్కడ చాన్స్ ఉంటే.. అక్కడ బిల్లులు పెండింగ్లో పెడుతోంది. సీఎఫ్ఎంఎస్లో అప్ లోడ్ చేసినవి.. చేయాల్సినవి రూ. నాలుగు వందల కోట్ల వరకూ పెండింగ్లో ఉన్నాయి. వీరికి చెల్లింపులు చేయడం లేదు. కోర్టులో పిటిషన్లు పడిన తర్వాత ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కోర్టుకు హాజరవుతున్నారు కానీ చెల్లింపులు చేయడం లేదు. దీంతో కోర్టు .. హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టకుండా పారిపోయారా అని అధికారుల్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.
కరోనా సమయంలో రోగులకు అన్నం పెట్టిన కాంట్రాక్టులు దక్కించుకుంది వైసీపీ నేతలే. ఇప్పుడు కోర్టుకెళ్లి పోరాడుతోంది కూడా వారే. ఎక్కడికక్కడ మంత్రులు.. ఇతర ముఖ్యనేతల సిఫార్సు మరేకు వారికి కాంట్రాక్టులు దక్కాయి. ఇప్పుడు తమ ప్రభుత్వంలో తమకు రావాల్సిన బిల్లుల కోస వారు న్యాయపోరాటం చేయాల్సి రావడం ఖచ్చితంగా విధి వంచితమే. ఈ విషయంలో అయినా వైసీపీ సర్కార్ కాస్త ఆలోచిస్తుందోలేకపోతే.. అన్నం పెట్టిన వారికి సున్నం పెడుతుందో చూడాలి !