తెలుగుదేశం పార్టీ మహానాడును మించి వైసీపీ కూడా ప్లీనరీ చేయాలని నిర్ణయించుకుంది. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికల సన్నాహాల కోసం మాత్రమే ప్లీనరీ నిర్వహించడం వైసీపీకి ఆనవాయితీగా మారింది. ఈ సారి కూడా ఎన్నికల సన్నాహాలను ప్రారంభించడానికి ప్లీనరీని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. నిజానికి ఈ నెలలోనే ప్లీనరీ చేద్దామని అనుకున్నారు కానీ.. వచ్చే నెలకు వాయిదా వేశారు. స్థలాన్ని మాత్రం ఖరారు చేశారు. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.
వచ్చే నెల ఎనిమిది, తొమ్మిదో తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిర్వహణకు సంబంధించిన కమిటీలపై సజ్జల రామకృష్ణారెడ్డి వర్కవుట్ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీసభలకు జనం రావడం లేదన్న ప్రచారం జరుగుతూండటంతో… ఆ ప్రచారాన్ని ప్లీనరీ ద్వారా పటా పంచలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మహానాడును మించి ఆదరణ ఉందని నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
సాధారణంగా ఎదైనా ఓ సందర్భం అంటే… పార్టీ ఆవిర్భవమో లేకపోతే.. వైఎస్ జయంతో.. వర్థంతో చూసుకుని ప్లీనరీ నిర్వహిస్తారు. దానికి తగ్గట్లుగా వచ్చే నెల లో వైఎస్ జయంతి ఉంది కాబట్టి.. ప్లీనరీకి తేదీగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రెండో సారి కూడా ఏపీలో సీఎంగా జగన్ రావడం ఎంత అవసరమో.. ప్లీనరీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు.