అసెంబ్లీలో తమపైనే టీడీపీ సభ్యులు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. చేతికి కట్టు కట్టుకుని ఎమ్మెల్యే సుధాకర్ బాబు కనిపించారు. మీడియా ముందు ఆరోపించారు. ఇలా ఆరోపించినప్పుడు అందరికీ వచ్చిన డౌట్ ఒకటే. అధికార పార్టీకి చెందిన వీరు తాము దాడికి గురైతే.. వీడియోలు ఎందుకు బయట పెట్టరు అనే. దాడి ఘటన జరగడానికి ముందే వ్యూహాత్మకంగా కేమెరాలను సభ్యుల వైపు మళ్లించారు. నిద్రపోతున్న సభ్యుల్ని చూపించారు కానీ పోడియం దగ్గర ఏం జరుగుతుందో చూపించలేదు.
కానీ అసెంబ్లీలో ప్రతి మూల ఏం జరుగుతుందో రికార్డు అవుతుంది. ఆ వీడియోను బయట పెడితే ఎవరు ఎవరిపై దాడి చేశారో స్పష్టమవుతుంది. దాడుల అంశం గురించి మీడియాలో వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన సందేహం అదే.. అన్ని కోణాల్లో మినిట్ టు మినిట్ వీడియోలు ఉంటాయి. ఎందుకు బయట పెట్టరు అనే. చివరికి టీడీపీ సభ్యులు కూడా ఇదే విషయాన్ని గట్టిగా అడిగారు. వీడియోలు మొత్తం బయట పెట్టాలన్నారు. అయితే వైసీపీ సభ్యులు కూడా ఈ ఘటన పై మాట్లాడారు. కానీ వారెవరూ వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేయలేదు. దీంతో వారే దాడి చేశారని ఎక్కువ మంది ఓ అభిప్రాయానికి వస్తున్నారు.
నిజంగా తాము దాడికి గురైతే ఆ విషయాన్ని వీడియో సాక్ష్యాల ద్వారా వెల్లడించవచ్చు కదా అనేది అందరికీ వచ్చే సందేహం. మరో వైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎవరైనా ధిక్కరిస్తే ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తామో… తమ ఎమ్మెల్యేలను బెదిరించడానికే ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడే సంస్కృతిని వైసీపీ తీసుకు వచ్చిందనే విమర్శలు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి.