హీరో సూర్యకి థియేటర్ యజమానుల నుండి ఓ చిక్కొంచింది. సూర్య సొంత బ్యానర్ లో ఆయనే నిర్మాతగా జ్యోతిక నటించిన సినిమా ‘పోన్ మగల్ వందల్’. లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయడం కుదరడం లేదు. అయితే మే మొదటి వారంలో నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నామని సూర్య ఓ ప్రకటన చేశాడు. అమెజాన్ ప్రైమ్‌లో సినిమా అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనిపై తమిళనాడు థియేటర్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘ సూర్య నిర్ణయం షాక్ కి గురి చేసింది. ఎప్పుడైనా సరే సినిమాను ముందు థియేటర్లో రావాలి. మేం నిర్మాతల్ని కలిసి మాట్లాడం. తమ నిర్ణయాన్ని మార్చుకోమని కోరాం. కానీ వారు మా మాట వినలేదు. ఇక భవిష్యత్తులో ఆ బ్యానర్‌పై తీసే ఏ సినిమాను కూడా థియేటర్లో ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నాం’ అని తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ సంఘాలు వెల్లడించాయి. అయితే దీనిపై సూర్య ఇంకా స్పందించలేదు.
లాక్ డౌన్ నేపధ్యంలో సినిమాల విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత కూడా థియేటర్ల కి అనుమతి వుంటుందా లేదో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి నేపధ్యంలో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫాం ని ఆశ్రయిస్తున్నారు. దీంతో థియేటర్ యజమానులనుండి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే నిర్మాత నిర్ణయాన్ని తప్పుపట్టే హక్కు థియేటర్ యజమానులకు ఉందా ? అనే పాయింట్ పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.