సంక్రాంతి సినిమాలొచ్చాయి.. మళ్లీ టాలీవుడ్ లో సినిమా `కళ` కనిపిస్తోంది.. అనగానే.. ఓ సరికొత్త ఇష్యూ ముందుకొచ్చింది. నైజాం డిస్టిబ్యూటర్ శీను దిల్ రాజుపై పెద్ద బాంబు వేశారు. ఆయన కిల్ రాజు అని, మంచి సినిమాల్ని చంపేస్తున్నారని, డిక్టేటర్ గా వ్యవహరిస్తున్నారని… పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. `ఇంగ్లీష్ అర్థం కాదు..` అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. థియేటర్లు చేతిలో ఉంచుకుని, మిగిలిన డిస్టిబ్యూటర్లని పైకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
దిల్ రాజు ఓ బడా నిర్మాత. పాతికేళ్ల ప్రయాణం ఆయనది. తెలుగు చిత్రసీమ చూసిన సక్సెస్ఫుల్ నిర్మాతల్లో ఆయనొకరు. ఓ రకంగా కింగ్ మేకర్. ఆయనపై ఇలా డైరెక్టుగా ఆరోపణలు చేయడం, అందులోనూ పర్సనల్ విషయాలు చొప్పించడం ఇండ్రస్ట్రీని అవాక్కయ్యేలా చేసింది. క్రాక్ సినిమా ఆడుతుంటే… దాన్ని తీసేసి డబ్బింగ్ సినిమా `మాస్టర్`కి అన్ని థియేటర్లు ఎలా ఇచ్చారన్నది ఆయన పాయింట్. ఇది ఇప్పుడు కొత్త కాదట. వాల్మీకి సమయంలోనూ ఇలానే జరిగిందని శీను ఆరోపిస్తున్నారు. థియేటర్ రెవిన్యూ సరిగా చూపించరని, ఆ రకంగా నిర్మాతల్నీ మోసం చేస్తున్నారని.. తీవ్రమైన కామెంట్లు చేశారు.
ఓ సినిమా ఆడుతుంటే, దాని స్థానంలో మరో కొత్త సినిమా వేయడం.. కొత్తేం కాదు. చాలామంది నిర్మాతలకు, పంపిణీదారులకు ఎదురైన అనుభవమే. ముఖ్యంగా సంక్రాంతిలాంటి సీజన్లో ఇలాంటివి తప్పవు. ఎందుకంటే ఈ సీజన్లో రోజుకో కొత్త సినిమా వస్తుంది. తొలి రోజు ఇచ్చిన థియేటర్లన్నీ.. రెండో రోజు కొనసాగించడం సాధ్యం కాదు. ఈసంక్రాంతికి అందరి కంటే ముందుగా `క్రాక్` వచ్చింది. కాబట్టి కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరికాయి. 13న `మాస్టర్` వచ్చినప్పుడు.. `క్రాక్`లోని కొన్ని థియేటర్లని తప్పనిసరిగా `మాస్టర్`కి బదలాయించాల్సివుంటుంది. 14న రెండు సినిమాలొచ్చాయి. అప్పుడు కూడా అంతే. `మాస్టర్` కి ఇచ్చిన థియేటర్లు కొన్ని రెండో రోజుకే.. అల్లుడు అదుర్స్, రెడ్ చేతికి వెళ్లిపోయాయి. కాబట్టి.. ఓ సినిమాని తప్పించి మరో సినిమా ఆడించడం.. సంక్రాంతి సీజన్లో పెద్ద నేరమైన విషయం కాదు.
కానీ ఇక్కడ ఓ విషయం గుర్తించుకోవాలి. `నాణ్యమైన థియేటర్లు` అన్నది వాలీడ్ పాయింట్. డబ్బా థియేటర్లు పరాయి సినిమాలకు, మంచి థియేటర్లని తన వాళ్ల సినిమాలకు బదలాయించుకోవడం ఓరకంగా కొంతమంది నిర్మాతలకూ, పంపిణీదారులకూ… మింగుడు పడని విషయం. మంచి థియేటర్లో సినిమా చూడాలి.. అనుకోవడం ప్రేక్షకుడి గొంతెమ్మ కోరికేం కాదు. న్యాయమైన కోరికే. ఒకే రోజు రెండు సినిమాలొచ్చినప్పుడు, ఏ సినిమాకి వెళ్లాలి? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు `ఏ థియేటర్లో సినిమా చూడబోతున్నాం` అన్నదీ ప్రేక్షకుడు బేరీజు వేసుకుంటాడు. కాబట్టి మంచి థియేటర్‌కే వెళ్తాడు. ఇలా మంచి థియేటర్లు కావల్సిన సినిమాలకు ఇచ్చుకోవడం అన్నది, మిగిలిన సినిమాల్ని చిన్న చూపు చూడడమే అవుతుందని కొంతమంది వాదన.
థియేటర్‌కి వస్తున్న రెవిన్యూ సరిగా చూపించడం లేదని, ఈ విషయంలో నిర్మాతల్ని దిల్ రాజు మోసం చేస్తున్నారని ఓ కొత్త ఆరోపణ మాత్రం చర్చనీయాంశం అవుతోందిప్పుడు. కొన్ని థియేటర్లు రెవిన్యూ షేర్ పద్ధతిన ఇస్తారు. ఆ రెవిన్యూ లో అంకెలన్నీ తప్పుల తడకలేనా? అసలు అలా జరిగే అవకాశం వుందా? అన్నది ఆలోచించుకోవాల్సిన విషయం. అల వైకుంఠపురంలో, సరిలేరు.. సినిమాలకు ఈ విషయంలో నష్టం జరిగింది శ్రీను చెబుతున్నారు. ఆ వివరాల్నీ త్వరలోనే బయట పెడతార్ట. రాష్ట్రంలోని ప్రతీ థియేటర్లోనూ ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ ఉంటే.. అసలు ఈ అవకతవకలే జరగవు.
అంతిమంగా సినిమా వ్యాపారం. నిర్మాత- పంపిణీదారుడు – ప్రదర్శన కారుడు.. ఇలా ఎవరైనా సరే, తమకు వచ్చే లాభం గురించే ఆలోచిస్తారు. ఏ సినిమా ఆడితే.. నాలుగు డబ్బులు వస్తాయి అన్నదే లెక్క. దాని ప్రకారం నడుచుకుపోవాల్సిందే. అందులో తప్పు లేదు. కాకపోతే.. మంచి సినిమాల్ని కిల్ చేయాలనుకోవడం, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలూ.. ఇండ్రస్ట్రీ మనుగడకే ముప్పు. సంక్రాంతి సీజన్లో సైతం… ఒకే రోజు రెండు సినిమాలు రాకుండా చూసుకోవడం, సినిమా సినిమాకీ మధ్య కనీసం ఒకట్రెండు రోజులు గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడడం, తెలుగు పండగల సీజన్లో డబ్బింగ్ సినిమాలకు చోటు లేకుండా చూసుకోవడం లాంటి విషయాల్లో దృష్టి పెడితే… ఇలాంటి సమస్యలు కాస్తయినా తగ్గుతాయి.