అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా `సోలో బతుకే సో బెటర్`. ఈ సినిమా ఎలా ఉంటుంది? హిట్టవుతుందా, లేదా? అనే ఆలోచనలు, అనుమానాలూ పక్కన పెడితే – జనం థియేటర్లకు వస్తారా? లేదా? అనే విషయం కనుక్కోవడానికి ఈ సినిమా ఓ ట్రైల్ గా భావించింది చిత్రసీమ. దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తరవాత థియేటర్లు తెరచుకుని, తొట్ట తొలిగా వచ్చిన సినిమా ఇది. ప్రేక్షకుల పల్స్, మూడ్, కరోనా భయాల్ని అంచనా వేయడానికి ఈ సినిమా ప్రయోగంగా భావించింది చిత్రసీమ. దానికి తగ్గ ఫలితమే వచ్చింది.
తొలి రోజు `సగం` హాళ్లు నిండిపోయాయి. 50 శాతం ఆక్యుపెన్సీ కదా..? సగం నిండితే, ఇప్పుడు థియేటర్లు నిండినట్టే. ఏ, బీ, సీ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలోనూ మంచి ఆదరణే లభించింది. సినిమా ఎలా ఉంది? అనేది పక్కన పెడితే.. జనం సినిమా చూడ్డానికి రెడీగానే ఉన్నారు అనే సంకేతాల్ని ఈ సినిమా పంపగలిగింది. స్టార్ హీరో సినిమా వస్తే.. జనాలు కిటకిటలాడతారు, ఇళ్ల దగ్గర్నుంచి కదిలి వస్తారు.. అనే విషయాన్ని నిరూపించగలిగింది. ఓ విధంగా.. థియేటర్లకు ప్రాణం మళ్లీ లేచొచ్చింది. సంక్రాంతికి సినిమాల్ని విడుదల చేయాలా? లేదా అనే మీమాంశకు .. ఈ సినిమా ఫలితం తెర దించినట్టైంది. ఓటీటీలో సినిమాలు వచ్చినా, వస్తున్నా – జనాలు థియేటర్లకు వచ్చి, ఆ మజాని ఆస్వాదించడానికి ఇష్టపడతారన్న విషయం ఈ శుక్రవారం నిరూపితమైంది. మన నిర్మాతలు ఇప్పుడు సంక్రాంతి వరకూ ఆగకపోవొచ్చు. అంతకంటే ముందే కొన్ని సినిమాల్ని రంగంలోకి దింపొచ్చు. 50 శాతం ఆక్యుపెన్సీ అనే పరిమితి కూడా తొలగించి 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇస్తే గనుక… పరిశ్రమకు గత వైభవం వచ్చినట్టే.