ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్లకు రప్పించడం ఎలా? అనే విషయం ఎలాగో తెలీక… చిత్రసీమ తలలు పట్టుకుంటోంది. ఇది వరకే… థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఓటీటీల హవా ఎక్కువయ్యాక…. అది మరింత కష్టం. సినిమాలన్నీ ఇంట్లో ఫ్రీగా చూసే రోజులొచ్చాయి. ఇప్పుడు టికెట్ పెట్టి సినిమా చూస్తాడా? అన్నది పెద్ద ప్రశ్న. పైగా కరోనా భయాలు మరోవైపు. ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచుకునే విషయంలో.. గేట్లు ఎత్తేయడం, టికెట్ రేటు ఎంతైనా ఉండొచ్చు… అని చెప్పడం సినిమా పరిశ్రమ ప్రగతికా? అధోగతికా? అనే సందేహాన్ని రేకెత్తిస్తోంది.
ఇప్పటికే టికెట్ రేట్లు భారంగా మారాయి. మామూలు థియేటర్లలో టికెట్ 100కి పైమాటే. మల్టీప్లెక్స్‌లో అయితే 150. సిట్టింగ్ ని బట్టి అది 250గా కూడా మారుతోంది. రిక్లైనర్స్ ఉంటే… 250 పెట్టి కొనాల్సిందే. టికెట్ రేట్లు అటుంచితే, పార్కింగ్ మరో బాదుడు. థియేటర్లో వాటర్ బాటిల్ కొనాలన్నా.. సామాన్యులు వణికిపోవాల్సిన పరిస్థితి. ఇక మల్టీప్లెక్స్‌లో తినుబండారాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చిత్రసీమపై ఎన్నికల వరాలు కురిపిస్తూ… `టికెట్ రేటు ఎంత ఉండాలన్నది మీ ఇష్టం` అంటూ… గేట్లు ఎత్తేశారు.
చిన్న సినిమాల విషయంలో టికెట్ రేట్లు పెంచడానికి నిర్మాతలు సాహసించకపోవొచ్చు. పెద్ద సినిమాలు వస్తేనే వాళ్లకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. సంక్రాంతికి వకీల్ సాబ్ లాంటి సినిమానే వచ్చిందనుకుందాం. బెన్ఫిట్ షో టికెట్లు ఎలాగూ 1500 నుంచి 2000 వరకూ ఉంటాయి. ఆ తరవాత కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఎలాగూ తొలి రెండు రోజులూ క్రౌడ్ బాగా ఉంటుంది. పైగా పవన్ ఫ్యాన్స్ ఆకలిమీద ఉన్నారు. టికెట్ రేటు 1500 చేసేస్తే పరిస్థితి ఏమిటి? సంక్రాంతికి వచ్చిన ప్రతీ పెద్ద సినిమా.. టికెట్ రేటుని డబుల్, ట్రిపుల్ చేసేస్తే అడిగేవాడు ఎవడు? థియేటర్లలో ఎలాగూ 50 శాతం ఆక్యుపెన్సీనే ఉండాలి. అందుకే… టికెట్ ధర అమాంతం పెంచి, ఆ నష్టాల్ని పూడ్చుకోవాలని చూస్తారు.
ఇది సామాన్యుల నడ్డి విరగ్గొట్టడమే కదా. సినిమాని సామాన్యులకు దూరం చేయడమే కదా..? టికెట్ రేట్ పెంచేశాక.. ఫస్ట్ షో ఫ్లాప్ అని తెలిస్తే. తరవాతి పరిస్థితి ఏమిటి? ఇంట్లో … ఓటీటీలో… ఫ్రీగా సినిమా చూడ్డానికి అలవాటు పడిన ప్రేక్షకుడు.. పెంచిన రేట్లు చూసి థియేటర్లకు వెళ్లగలడా? ఇవన్నీ చిత్రసీమని ఆలోచనలో పడేసే విషయాలే.
ఢిల్లీ, బెంగళూరు లాంటి సిటీల్లో టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు ఉందంటున్నారు. అయితే.. అందులో రెండో కోణం కూడా ఉంది. వీకెండ్స్ లో ఎలాగూ రష్ ఎక్కువ. అప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. వీక్ డేస్‌లో… థియేటర్లు ఖాళీగా ఉంటాయి. అప్పుడు టికెట్ రేట్లు తగ్గిస్తారా? మల్టీప్లెక్స్‌లో 150కి అమ్మే టికెట్… వీక్ డేస్‌లో.. 100కు చేయగలరా? సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో ఒక రేటు, శుక్ర, శని, ఆది వారాల్లో మరో రేటు..పెడితే మంచిదే. సామాన్యులకు అనువైన రోజునే సినిమా చూడగలరు. అలా కాదని.. ఇష్టం వచ్చినప్పుడు సినిమా రేట్లు పెంచేసి, సినిమా అంతంత మాత్రమే అనుకున్నప్పుడు టికెట్ రేటు తగ్గిస్తే.. అది ప్రేక్షకుడ్ని మోసం చేసినట్టే. టికెట్ ధరల విషయంలో నియంత్రణ అధికారం ప్రభుత్వానికి ఉండాలన్నది పెద్దల మాట. లేదంటే… యధే రాజ్యంగా ప్రేక్షకుల్ని దోచుకోవడానికే చూస్తారు.