ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఎలా?
– ప్రస్తుతం చిత్రసీమ దీనికి సమాధానం రాబట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇది వరకు సినిమాలకు పైరసీ, లేదంటే… ఓ టీటీ సమస్యలుగా ఉండేవి. ఇప్పుడు కొత్తగా కరోనా వచ్చి పడింది. కరోనా భయంతో థియేటర్లు తెరచుకున్నా ప్రేక్షకులు వస్తారా, రారా? లేదంటే ఓ టీ టీకి అలవాటు పడిపోయి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటారా? అలాగైతే థియేటర్లేం కావాలి, సినిమా ఏం కావాలి? ఇలా రకరకాల భయాలు.
అందుకే.. బ్యాక్ టూ రూట్స్ లా… బ్యాక్ టూ థియేటర్స్ అనే అంశం పై తీవ్రంగా చర్చ సాగుతోంది. మొన్న థియేటర్లలో మద్యం సరఫరా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. దానిపై చిత్రసీమలో చర్చ మొదలైంది. అలా చేస్తే… కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు శాశ్వతంగా దూరం అవుతారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే.. సింగిల్ స్క్రీన్లూ, మల్టీప్లెక్సులూ ప్రత్యేకంగా ఎలా ఉన్నాయో… అలా మద్యం దొరికే థియేటర్లనూ ఓ కేటగిరిగా మార్చి చూస్తే.. ప్రయోజనం కనిపించొచ్చన్న ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిర్మాతల ఆలోచనలే. వీటిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి.
ఇప్పుడు మరో ఆలోచన వచ్చింది. థియేటర్లని సరికొత్త వినోదాల వేదికగా మార్చడం. అంటే.. అక్కడ బర్త్‌డే పార్టీలు సెలబ్రేట్ చేయడం, తమ అభిమాన హీరోలతో, హీరోయిన్లతో చర్చా కార్యక్రమాలు నిర్వహించడం, వాళ్లతో కలసి డాన్స్‌లు చేయడం ఇలాగన్నమాట. ఫ్యాన్స్ థియేటర్స్ అనే పేరుతో కొన్ని థియేటర్లు ఏర్పాటు చేసి, అక్కడ అభిమానుల్ని నేరుగా సినీ తారలు కలుసుకునే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్నది ఓ ఆలోచన. పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా థియేటర్లు నిర్మించే ప్లాన్ ఉందట. మొత్తానికి థియేటర్ ని ఓ పిక్నిక్ స్పాట్‌గా మార్చాలన్న ఆలోచనలో ఉంది సినిమా రంగం.
దీనిపై నిర్మాత డి.సురేష్ బాబు స్పందించారు. ఇంటిని, కంప్యూటర్ని, టీవీని వదిలి ప్రేక్షకుడు థియేటర్ కి రావడానికి ఏం చేయాలన్న విషయంపై చిత్రబృందం కసరత్తులు చేస్తోందని, ఏం చేసినా ప్రేక్షకుడికి ఓసరికొత్త అనుభూతిని ఇవ్వడానికే అని. పిల్లల కోసం వేరుగా, కుటుంబ ప్రేక్షకుల కోసం వేరుగా, పెద్దల కోసం వేరుగా, మద్యం సేవిస్తూ సినిమా చూడ్డానికి ఇష్టపడేవాళ్ల కోసం వేరుగా థియేటర్లు విభజించే ఆలోచన ఉందని చెప్పారు. మొత్తానికి కరోనా వల్ల థియేటర్ వ్యవస్థలోనే సమూలమైన మార్పులు రాబోతున్నాయన్న విషయం స్పష్టం అవుతోంది. భవిష్యత్తులో ఇంకెన్ని వింతలూ, విడ్డూరాలూ చూడాలో?