హౌస్ఫుల్ బోర్డులు చూడాలని కలలుగనని నిర్మాతలు, దర్శకులు, హీరోలు, అభిమానులు ఉంటారా?
థియేటర్ ముందు… హౌస్ఫుల్ బోర్డు కనిపించిన క్షణం… ఓ రకమైన సంతృప్తి. సినిమా జయాపజయాలకు అదో సంకేతం. మరి… అలాంటి బోర్డులు భవిష్యత్తులో చూడగలమా?
కరోనా మహమ్మారి సినిమాల్నీ, థియేటర్ వ్యవస్థల్నీ కబళిస్తోంది. ఇక మీదట థియేటర్ల ముందు తోపులాటలు కనిపించకూడదు. టికెట్ కౌంటర్ల ముందు క్యూలు కూడా పాత ముచ్చటగానే మిగిలిపోతుంది. కిక్కిరిసిన థియేటర్లు చూడలేం. కారణం కరోనా. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా అంటూ చిత్రసీమ యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే థియేటర్లు తెరచుకున్నంత మాత్రాన – అన్ని సమస్యలకూ పరిష్కారం దొరికినట్టు కాదు. అప్పుడే కొత్త సమస్యలు తలెత్తుతాయి. సీటు విడచి సీటు.. అన్నది కొత్త రూలు. అంటే… థియేటర్ సిట్టింగ్ కెపాసిటీ వంద అయితే.. యాభై మంది ప్రేక్షకులకే అనుమతి ఇవ్వాలి. అంటే హౌస్ ఫుల్ కాస్తా.. హౌస్ హాఫ్.. అయ్యిందన్నమాట. హైదరాబాద్ నగరంలోని ఓ థియేటర్లో సగం సీట్లని పీకేశారు కూడా. మిగిలిన థియేటర్లూ ఇలానే ముస్తాబు కావాల్సివుంది.
సినిమా విడుదలై తొలి మూడు రోజుల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు చూసే అవకాశం దక్కుతుంది. నిర్మాతలకు, సినిమాకొన్నవాళ్లకూ గిట్టుబాటు అయ్యేది ఆ మూడు రోజులే. వీక్ డేస్లో ఎలాగూ… థియేటర్లు నిండవు. రాత్రి ఆటలకు తప్ప. అలాంటిది.. ఇప్పుడు ఏ రోజూ థియేటర్లలో నిండుగా జనం కనిపించరు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లని నడపడం సాధ్యమా? అన్నది కొత్త ప్రశ్న. ఆదాయం సగం అయిపోతున్నప్పుడు భారీ రేట్లు పెట్టి, సినిమాల్ని కొనడానికి బయ్యర్ ముందుకొస్తాడా? సగం థియేటర్ అయినంత మాత్రాన… ఖర్చు తగ్గుతుందా? అదే అద్దె. అదే కరెంటు బిల్లు. పైగా ఇది వరకటికంటే ఎక్కువ శుభ్రత పాటించాలి. షో కీ షోకీ మధ్య శానిటైజేషన్ చేయించాలి. అలాగని టికెట్ రేటు పెంచడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. పైగా.. టికెట్ రేట్లు బాగా తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో – సగం సీట్లు పీకేసిన థియేటర్లో సినిమాని నడపడానికి ఎవరు ముందుకొస్తారు? ఈ ప్రశ్నలన్నీ నిర్మాతల్నీ, పంపిణీదారుల్ని, ప్రదర్శన కారుల్నీ వేధిస్తున్నవే. అందుకే.. థియేటర్లు ఇప్పటికిప్పుడు తెరచుకున్నా, కొత్త సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేసే అవకాశాలు తక్కువన్న వాదన వినిపిస్తోంది. థియేటర్లకు పర్మిషన్లు ఇచ్చాక గానీ.. ఈ విషయంలోని అసలు లోటు పాట్లు అర్థం కావు.