తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నిర్మాతలు థియేటర్ అద్దెలు పెంచి సపోర్ట్ చేయాలనేది వారి డిమాండ్.
నిజానికి వీరి డిమాండ్ లో న్యాయం వుంది. ఇది టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరికగా చూడాలి. గత రెండు నెలలుగా సరైన సినిమా పడలేదు. ఎలక్షన్స్, ఐపీఎల్ కారణంగా క్రేజ్ వున్న సినిమాలన్నీ వెనకడుగు వేశాయి. ఈ వారం రావాల్సిన విశ్వక్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ వారం వస్తున్న సినిమాల్లో ఒక్క సినిమాకీ టికెట్లు తెగే క్రేజ్ లేదు. ఇలాంటి నేపధ్యంలో సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు ఈ నిర్ణయానికి రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.
సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఎప్పటినుంచో బాలేదు. ఎప్పుడో పండక్కి, దసరాకి తప్పితే సైకిల్ స్టాండ్స్ నిండే సినిమాలు రావడం లేదు. ప్రతినెల ఓ క్రేజ్ వున్నా సినిమాని ప్లాన్ చేసుకోవాలనే సూచనలు, సలహాలు పరిశ్రమ ముందు ఎప్పటినుంచో వెళ్ళబుచ్చుతున్నా ప్రయోజనం లేదు. సినిమాలన్నీ ఎదో సీజన్ క్యాష్ చేసుకోవడానికి రిలీజ్ డేట్లు ఇచ్చుకుంటున్నాయి తప్పితే సింగిల్ స్క్రీన్స్ ని, పరిశ్రమ మనుగడని ద్రుష్టి పెట్టుకొని ప్రణాళికలు వుండటం లేదు.
మల్టీ ప్లెక్స్ లు కేవలం నగరాల్లో మనగలుగుతున్నాయి. వాటి టార్గెట్ ఆడియన్స్ వేరు. సరదాగా షాపింగ్ కి వెళ్ళిన జనాలు ఎదో ఓ హాలీవుడ్ సినిమా ఆడుతున్నా సరే కాసేపు రిలాక్స్ అవుదామని వెళ్లి కూర్చుంటారు. కానీ సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఇలా వుండదు. ఇక్కడ టికెట్ తెగాలంటే ఎంతోకొంత క్రేజ్, అభిమాన హీరో సినిమా అయ్యిండాలి. అలాంటి సినిమాని ప్రేక్షకులకు అందించడంలో పరిశ్రమ చొరవ చూపినట్లు కనిపించడం లేదు. దీంతో థియేటర్స్ మూసేసే పరిస్థితులు వస్తున్నాయి.