తెలంగాణ ప్రభుత్వం కరోనాని దృష్టిలో పెట్టుకుని థియేటర్లని బంద్ చేసింది. విద్యా సంస్థలకూ తలుపులు వేసేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేల్కొంది. అక్కడి విద్యాసంస్థల్ని తాత్కాలికంగా మూసేయాలని వైకాపాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే థియేటర్ల విషయం ఇంకా తేల్చలేదు. తెలంగాణలో థియేటర్లు మూతబడ్డా.. ఏపీలో మాత్రం బొమ్మ ఇంకా ఆడుతూనే ఉంది. తాజా ఉత్తర్వ్యులలో కూడా థియేటర్ల ప్రస్తావన ఎక్కడా లేదు. జన సమూహాల ఏర్పాటులో థియేటర్లది కీలక పాత్ర. మరి జగన్ ప్రభుత్వం వాటిపై దృష్టి చూపించలేదెందుకో..?
అయితే.. ఏపీలోని డిస్ట్యిబ్యూటర్లంతా కలిసి.. స్వచ్ఛందంగా సినిమాల్ని నిలిపి వేయాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడకుండా.. సినిమాల ప్రదర్శనని ఆపేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో థియేటర్లు బంద్ అయితే.. కేవలం ఆంధ్రా కోసం కొత్త సినిమాల్ని విడుదల చేయాల్సివస్తుంది. ఆ తరవాత తెలంగాణలో విడుదల చేసుకోవాలి. ఆ రిస్కు తీసుకోవడానికి నిర్మాతలెవరూ సిద్ధంగా లేరు. అంటే.. తెలంగాణలో థియేటర్లు తెరచేలోగా.. కొత్త సినిమాలేం రావు. ఆ మాత్రం దానికి ఏపీలో థియేటర్లు తెరచి ఉంచడం వల్ల ఉపయోగం లేదు. పైగా అక్కడ సినిమాలన్నీ ఈపాటికే నత్త నడక నడుస్తున్నాయి. థియేటర్ల అద్దెలకు సరిపడా టికెట్లు కూడా తెగడం లేదు. దాంతో.. ప్రదర్శన కారులు, పంపిణీదారులు స్వచ్ఛందంగా థియేటర్లని మూసేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అతి త్వరలో ఈ విషయమై ఓ ప్రకటన రావొచ్చు.