ఈనెల 15 నుంచి థియేటర్లు తెరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నిర్ణయాధికారం మాత్రం రాష్ట్రాలకే కట్టబెట్టింది. ఏపీలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి. త్వరలోనే చిత్రసీమకు చెందిన ప్రముఖులు కేసీఆర్తో భేటీ కానున్నారు. ధియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎం ని కోరబోతున్నారు. ఎందుకంటే సినిమాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగు ప్రభుత్వాలు ఉమ్మడిగానే తీసుకోవాల్సి వస్తోంది. తెలంగాణలో థియేటర్లకు అనుమతి ఇవ్వకపోతే.. ఏపీలో ఇచ్చినా ప్రయోజనం లేదు. ఎందుకంటే సినిమా ఏదైనా రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి విడుదల చేసుకోవాలి.
అందుకే తెలంగాణ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావాలని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఏపీలో మాత్రం థియేటర్లు తెరచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చినా థియేటర్ యజమానులు సముఖంగా లేరు. థియేటర్లు ఇప్పటికిప్పుడు తెరచుకునే పరిస్థితులు లేవని, దీపావళి నుంచి థియేటర్లు తెరుస్తామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాల వారిగా థియేటర్ యజమానులు సమావేశం అవుతున్నారు. తూర్పుగోదావరి లో థియేటర్లన్నీ.. దీపావళి నుంచి అందుబాటులోకి వస్తాయని థియేటర్ యజమానుల సంఘం ప్రకటించింది. మిగిలిన జిల్లాలలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది. సో… ఏపీలోనూ థియేటర్లు దీపావళికే తెరచుకుంటాయి. తెలంగాణలోనూ ఇదే జరగొచ్చు. దీపావళి నుంచి తెలంగాణలో థియేటర్లు తెరచుకునే అవకాశం ఉందని, ఇది వరకటిలా రిలీజ్ లు భారీగా జరగాలంటే మరో నెల రోజులు ఆగాలని టాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.