సినీ అభిమానులకు శుభవార్త. త్వరలో తెలంగాణలోనూ థియేటర్లు తెరచుకోబోతున్నాయి. అన్ లాక్ లో భాగంగా… థియేటర్లు తెరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో అనుమతులు ఇచ్చింది. అయితే కొన్ని మార్గ దర్శకాలను పాటించమని ఆదేశించింది. థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇవ్వాలో, లేదో.. రాష్ట్ర ప్రభుత్వాలే తేల్చుకోవాలని చెప్పింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చేసింది. అయితే సగం సీట్లతో థియేటర్లని నడిపించడం కష్టం కాబట్టి, తెలుగు సినిమా అనేది తెలంగాణ తోనూ ముడి పడి ఉన్న అంశం కాబట్టి.. కొత్త సినిమాలేం విడుదల కాలేదు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైతం.. థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇస్తూ ఓ జీవో జారీ చేసింది. డిసెంబరు 11 నుంచి… థియేటర్లు తెరచుకోవొచ్చు. అయితే… ఈ వార్త నిర్మాతల్ని ఉత్సాహపరచడం లేదు. ఎందుకంటే… టికెట్లు సగం అమ్ముకోవాలో, పూర్తిగా అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చారో అన్న క్లారిటీ.. ఈ జీవోలో లేదు. డిసెంబరు 11 నుంచి థియేటర్లు ఓపెన్ అయినా.. కొత్త సినిమాలేం కనిపించవు. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన కొన్ని సినిమాల్ని ఇప్పుడు థియేటర్లలోనూ చూసే అవకాశం దక్కుతుంది. కొన్ని మల్టీప్లెక్సులు ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్ల కు అలవాటు చేయడానికి ఫ్రీ షోలు వేయబోతున్నాయి. అలా.. డిసెంబరులో కొత్త సినిమాల ఊసు లేకపోవొచ్చు. జనవరి తొలి వారం నుంచి.. బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాల్ని చూసే అవకాశం ఉంది. అయితే.. పూర్తి టికెట్లు అమ్ముకునే వెసులు బాటు కల్పిస్తేనే. లేదంటే.. కొత్త సినిమాల రాకడ కష్టమే.