లాక్ డౌన్ వల్ల అన్ని పరిశ్రమలూ నష్టపోయాయి. చిత్రసీమ దానికి అతీతం కాదు. ఇప్పటికిప్పుడు లెక్కలు తేలవు గానీ, నష్టాలు మాత్రం భారీగానే ఉండబోతున్నాయి. లాక్డౌన్ ఎత్తేశాక కూడా పరిస్థితి కుదుట పడుతుందని చెప్పలేం. మే వరకూ థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. తెరిచిన తరవాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో చెప్పలేం. ఎందుకంటే… జనజీవనం మొత్తం అస్తవ్యస్థమైపోయింది. ఉద్యోగాలు పోతున్నాయి, ఉన్నా.. జీతాలు సరిగా రావడం లేదు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ దశలో సామాన్యుడు కుదుట పడాలంటే… చాలా కాలం పడుతుంది. ఈలోగా థియేటర్లకు వచ్చి, సినిమాలు చూసి, వినోదించేంత స్థోమత లేకపోవొచ్చు.
అందుకే…ఒకవేళ థియేటర్లు తెరచుకుంటే, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి, థియేటర్లు నింపుకోవడానికి చిత్ర సీమ ఓ ఆలోచన చేస్తోంది. టికెట్టు రేట్లు తగ్గించడం ఓ మార్గంలా కనిపిస్తోంది. మల్టీప్లెక్స్ లో టికెట్ 150 రూపాయలు. దాన్ని 100కి కుదించే అవకాశాలు లేకపోలేదు. సింగిల్ స్క్రీన్ విషయంలోనూ ఇంతే దాదాపు 40 శాతం రేట్లు తగ్గించే ఛాన్సుంది. ఈ విషయమై ఓ అగ్ర నిర్మాత తెలుగు 360తో మాట్లాడారు. “పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సామాన్యుడు కోలుకోవడానికే చాలా రోజులు పడుతుంది. ఇలాంటి స్థితిలో వినోదం గురించో, సినిమా గురించో ఆలోచించడు. పైగా ఓటీటీ ద్వారా చాలా వరకూ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులు వాటికి అలవాటు పడ్డారు. అలాంటి ప్రేక్షకుడ్ని మళ్లీ థియేటర్లవైపు నడిపించడం చాలా కష్టం. చిత్రసీమకు అదే అది పెద్ద సవాల్. దాన్ని స్వీకరించాలి కూడా. టికెట్టు రేట్లు తగ్గించడం ఓ ప్రధాన మార్గం. కనీసం తాత్కాలికంగానైనా రేట్లు తగ్గించాలి. లేదంటే.. థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగదు” అన్నారు. మిగిలిన నిర్మాతలంతా ఇదే మాటపై ఉంటే… టికెట్టు రేట్లు తగ్గడం ఖాయం.