పనామా పేపర్ల పేరుతో గతంలో లీకయిన ప్రముఖుల విదేశీ లావాదేవీల వ్యవహారాలు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటిదే పండోరా పేపర్ల పేరుతో అంతర్జాతీయ పరిశోధన జర్నలిస్టుల గ్రూప్ కొన్ని డాక్యుమెంట్లలో వెలుగులోకి తెచ్చింది. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా 35 మంది దేశాధినేతలు, ప్రధానులు, మాజీల అక్రమ లావాదేవీల గుట్టు ఉంది. భారత్‌కు చెందిన 380 మంది వ్యవహారాలు పండోరా పేపర్స్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో కొంత మంది వివరాలు బయటకు వచ్చాయి. ఆరుగురు మాజీ ఎంపీలు భారీగా విదేశాల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారుని పండోరా పేపర్స్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
ఇండియాలో దివాలా తీసిన అనిల్ అంబానీ విదేశాల్లో 18 ఆఫ్‌షోర్ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేస్తున్నట్లుగా పండోరా పేపర్స్ చెబుతున్నాయి. సచిన్ టెండుల్కర్‌కు కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఓ ట్రస్టు ఉందట. నీరవ్ మోడీ కూడా ఓ ట్రస్టును ఏర్పాటుచేసి మరీ పారిపోయారు. భారత్ నుంచి లిస్టులో ఉన్న వారిలో అత్యధిక మంది సీబీఐ, ఈడీ కేసులు, ఆర్థిక నేరాల కేసుల్లో ఉన్న వారేనని తెలుస్తోంది. వీరిలో వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులే ఎక్కువ మంది ఉన్నారు.
వీరంతా తాము అక్రమంగా ఆర్జించిన సొమ్మును పన్ను ఎగవేత దేశాల్లో అత్యంత సంక్లిష్టమైన ట్రస్టులు, కంపెనీల్లో దాచుకుంటున్నారని చెప్పడమే పండోరా పేపర్స్ లీకుల ఉద్దేశం. ఆ ట్రస్టులు, కంపెనీల అసలు యజమానులెవరో తెలుసుకోవడం దర్యాప్తు సంస్థలకూ సాధ్యం కాదట. సంక్లిష్టంగా ఆఫ్‌షోర్ కంపెనీలు, ట్రస్టుల నిర్మాణం ఉంటుందని వారి అక్రమ సంపాదన సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో ఇలా బయటకు వస్తున్న పేపర్లపై ప్రభుత్వాలు దర్యాప్తు చేయించడంలేదు.