అన్నా డిఎంకెకు బిజెపి మధ్య తాను రాయబారిగా వ్యవహరించచిన మాట నిజమేనని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త కాలమిస్టు ఎస్.గురుమూర్తి వెళ్లడించారు. 2016 డిసెంబరు ప్రాంతంలో బిజెపి శశికళను నేస్తంగా భావించిందని కూడా ఆయన చెప్పారు.అయితే ఆమెకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే దాని ఆలోచనా ధోరణి మారిందన్నారు. టిటివి దినకరన్ స్వయంకృతాల కారణంగా చాలా పరిణామాలు వేగంగా తోసుకొచ్చాయి. వాటిని బట్టి కేంద్రం, మోడీ ప్రభుత్వం శశికళ వర్గానికి వ్యతిరేకంగా వున్నట్టు చాలామంది భావించారు. కాని వాస్తవం ఏమంటే వారెప్పుడూ తమిళనాడు గురించి పెద్దగా తలనొప్పిపెట్టుకోలేదు. ఫళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు విలీనం కావాలనుకున్నప్పుడు నా సలహా అడిగిన మాట కూడా నిజమే.నేను జోక్యం చేసుకోను గాని కలవకపోతే ఇద్దరూ దెబ్బతింటారన్నది నిజం అని తాను చెప్పారట. మొత్తంపైన ఇవన్నీ చూస్తుంటే గురుమూర్తి అన్నాడిఎంకె వ్యవహారలతో ఎప్పుడూ సంబంధం కలిగివున్నట్టే అర్థమవుతుంది. అయితే హఠాత్తుగా ప్రధాని మోడీ చెన్నైలో డిఎంకె అద్యక్షుడు కరుణానిధిని కలసి వచ్చారు. 2జి కేసులో అనుకూలమైన తీర్పు వస్తుందనడానికి అదో సంకేతమని నేను ఆ రోజే సాక్షిలో చెప్పాను. నిజంగా అలాగే జరిగింది కూడా. అంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో బిజెపి ఉభయ డిఎంకెలకూ తలుపులు తెరచిపెట్టిందన్నమాట. అయితే కాంగ్రెస్ కూడా అంత తేలిగ్గా పాత స్నేహితులను వదులుకోకపోవచ్చు. అప్పట్లో తమ వారిని అరెస్టు చేయించినందుకు మాత్రం డిఎంకె చాలా కోపగించింది. 2జిపై విస్తారంగా రాసిన గురుమూర్తి ప్రస్తుత తీర్పును పెద్దగా తప్పు పట్టడం లేదు. పైగా దాని ప్రభావం 2014 ఎన్నికలతో ముగిసిపోయిందని, 2019లో వుండబోదని జోస్యం చెబుతున్నారు. ఏదైనా రాజకీయ ప్రయోజనం ముఖ్యం కదా!