ఆంధ్రప్రదేశ్లో ఈ సారి రాజకీయ పాదయాత్రలు లేవు. అరవైఏళ్లు దాటిన వయసులో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఈ సారి రాజకీయానికి అంత అవసరం లేదని భావిస్తున్నారు. పైగా పాదయాత్ర కాన్సెప్ట్ పాతబడిపోయిందని దాని కోసం విపరీతంగా ఖర్చుపెట్టుకోవడం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఈ సారి టీడీపీ ప్రచారంలో స్పష్టమైన తేడా కనిపించనుంది. చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ కూడా విస్తృతంగా ఏపీ వ్యాప్తంగా పర్యటించనున్నారు. మే చివరిలో టీడీపీ మహానాడు జరగనుంది.
అంత కంటే ముందు నుంచే వీరు ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీలో ప్రస్తుతం ఏ ఒక్కర్నీ సీఎంజగన్ ప్రశాంతంగా బతకనీయడం లేదని.. కనీసం రేషన్ కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారని.. దీనిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పూర్తి స్థాయిలో బయటకు తీసుకు వచ్చేలా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. అచ్చెన్నాయుడుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయనను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టడం.. మంచి వాగ్ధాటి కారణంగా ఆయన ప్రచారం కూడా హైలెట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే లోకేష్ తన పర్యటన ల ద్వారా పాజిటివ్ అభిప్రాయాన్ని క్యాడర్లో కల్పించారు. టీడీపీకి ఈ సారి ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు ఉంటారని ఆ పార్టీ క్యాడర్ సంతృప్తి పడుతోంది. అయితే వీరిలో ఎవరూ పాదయాత్రలు చేయడం లేదు. అలాగే జనసేనాని కూడా పాదయాత్రలు చేయడం లేదని … ఆయన కూడా వాహనం ద్వారానే రాష్ట్రాన్ని చుట్టాలని భావిస్తున్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వంటి వారు ప్రారంభిస్తారని చెబుతున్నారు. కానీ ఏపీలో మాత్రం ఎలాంటి పాదయాత్రలూ నేతలు పెట్టుకోవడం లేదు.