వైఎస్ వివేకానందరెడ్డి కేసులో జగన్ను ఇరికించే కుట్ర జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక చాలా కథ ఉందన్న గుసగుసలు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. జగన్, భారతి ఫోన్లు అటెండ్ చేసే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను విచారించిన సీబీఐ.. తర్వాత కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో బయటకు వచ్చి ఇదేదో కుట్ర అన్నట్లుగా సజ్జల స్టేట్ మెంట్ ఇవ్వడంతోనే అసలు సీన్ అర్థమైపోతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
తమకు వ్యతిరేకంగా ఏం జరిగినా అది కుట్రే అనుకోవడం వైసీపీ నేతల శైలి. వివేకా హత్య కేసులో మొదట చంద్రబాబు దగ్గర్నుంచి ప్రారంభించి వివేకా కూతురు, అల్లుడే చంపించారనే వరకూ ఎన్నో ఆరోపణలు వారే మార్చి మార్చి చేశారు. ఇప్పుడు ఆ కేసు మెల్లగా అసలు సూత్రధారుల వద్దకు వస్తున్న సూచనలు కనిపిస్తూండటంతో.. గగ్గోలు పెట్టడానికి సిద్ధమైపోయారని తాజాగా మాటలతోనే తెలుస్తోందని అంటున్నారు. వివేకా హత్య కేసులో ఎన్నో అనుమానాలు సామాన్య ప్రజలకు ఉన్నాయి. ఇప్పుడు వాటికి క్లారిటీ ఇచ్చే దిశగా సీబీఐ సాగుతోంది. కానీ ఇది సజ్జలకు కుట్రలాగా అనిపిస్తోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు మాత్రమే కాదు.. . సాక్షిని… కూలి మీడియాగా పేరున్న ఇతర సంస్థలకూ అనధికారిక ఎడిటర్. ఎప్పుడు ఎలాంటి ప్రచారాలు చేయాలో ఆయన నిర్దేశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన జగన్ కు నోటీసులు వస్తే అది కుట్రగా ప్రచారం చేయడానికి రెడీ అయిపోయారని మాటల ద్వారానే అర్థమైపోతుంది. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుల్ని రక్షించడానికి అన్ని రకాల వ్యవస్థల్ని ఉపయోగించడం.. బెదిరించడం చేసినప్పుడే అసలు విషయం చాలా మందికి క్లారిటీకి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు సీబీఐ అందులో నిజాల్ని బయటపెడుతుందనే ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తున్నారు.