రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి.. రాజకీయ సంబంధాల ద్వారా కూడా చేయాల్సిన ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వైసీపీ అధినేత జగన్‌కు సానుకూల నిర్ణయం రాలేదు. రఘురామపై అనర్హతా వేటుకు అవకాశం లేదని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తెలిపింది. విప్ ఉల్లంఘించినప్పుడు మాత్రమే అనర్హతా వేటుకు అవకాశం ఉంటుందని స్పీకర్ ఆఫీస్ తెలిపింది. ఇతర ఫిర్యాదుల విషయం ప్రివిలేజ్ కమిటీ వద్ద ఉందని.. వాటిపై విచారణ జరుగుతోందని.. ఆ నివేదిక ఎప్పుడు వస్తుందో తెలియదని ప్రకటన విడుదల చేసింది. అలాగే రఘురామ ఫిర్యాదు చేసిన తనపై పోలీసుల దాడి అంశం కూడా స్పీకర్ కార్యాలయం పరధిలోకి రాదన్నారు.
స్పీకర్ కార్యాలయం ప్రకటన ప్రకారం రఘురామపై అనర్హతా వేటు సాధ్యం కాదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ జారీ చేసిన ఎలాంటి విప్‌ను ధిక్కరించలేదు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనో.., మరో కారణం చేతనో ఆయనపై వేటు వేయలేరు. చట్టం ఆ వెసులుబాటు కల్పించలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు పూర్తిగా విఫలమైనట్లేనని అర్థం చేసుకోవచ్చు. స్పీకర్ ఈ అంశంపై స్పష్టత ఇవ్వడంతో వైసీపీ వర్గాలు కూడా నిరాశపడుతున్నాయి.
నిజానికి రఘురామపై అనర్హతా వేటు సాధ్యం కాదని న్యాయనిపుణులు ముందు నుంచీ చెబుతున్నారు. అనర్హతా చట్టంలో చాలా స్పష్టంగా ఎప్పుడు అనర్హతా వేటు వేయాలో చెప్పారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ విప్‌ను ఉల్లంఘించినప్పుడు అనర్హతా వేటు వేయాలని చట్టంలో ఉంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా వేటు వేయవచ్చు. అయితే రఘురామ ఏ పార్టీలోనూ చేరలేదు. తాను వైసీపీలోనే ఉన్నానంటున్నారు. ఈ కారణంతో జగన్ పంతం నెరవేరే అవకాశం లేదని తేలిపోయింది. రాజకీయ ఒత్తిళ్లు తెచ్చినా ప్రయోజనం లేకపోయింది.