హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ హైదరాబాద్ ఆస్పత్రిలో చేరారు. ఈ కారణంగా ఆయన కొన్నాళ్ల పాటు పాదయాత్ర ఆపనున్నారు. ఆయన సైలెంట్ అయితే.. నియోజకవర్గంలో ఆయన అనుచరులు కూడా పెద్దగా చేసేదేమీ ఉండదు. దీనికి కారణం అక్కడ బీజేపీ క్యాడర్ అంటే ఈటల క్యాడర్ కావడం మాత్రమే కాదు.. బీజేపీ పార్టీ పరంగా అక్కడ ఎలాంటి సపోర్టు లేకుండా ఇప్పటివరకూ వ్యవహారాలు జరగడం దీనికి కారణగా చెప్పుకోవచ్చు. ఈటల రాజేందర్ పార్టీలో చేరికే.. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటంలా సాగింది. చివరికి ఆయనను పార్టీలో చేర్చిన తర్వాత రెండు వర్గాలూ పట్టించుకోవడం మానేశాయి. దీంతో ఈటలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఈటల పార్టీలో చేరిన తర్వాత కేంద్ర సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి.. కేబినెట్ మినిస్టర్‌గా ప్రమోషన్ వచ్చింది. ఆయన పాలనా వ్యవహారాలు.. కర్ణాటక రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈటల గురించి ఆలోచించే తీరిక లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ … ఈటల రాకను పెద్దగా స్వాగతించడం లేదు. దాంతో ఆయన ఈటల గురించి ఎక్కడా పాజిటివ్‌గా స్పందిస్తున్న దాఖలాలు లేవు. కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. హూజూరాబాద్‌లో గెలుస్తాం… బీజేపీ దున్నేస్తుంది అని చెబుతున్నారు కానీ అక్కడ పోటీ చేయబోయే ఈటల కోసం.. ఇంత వరకూ ప్రత్యేకమైన కార్యాచరణ ఏమీ ప్రకటించలేదు. నియోజకవర్గ మండల ఇంచార్జుల్ని ప్రకటించి సైలెంటయ్యారు.
పార్టీ హైకమాండ్ కూడా.. రాజీనామా చేసిన వెంటనే ప్రచార రంగంలోకి దిగాలని సూచించింది. అంటే.. వెంటనే ఉపఎన్నిక పెట్టేస్తారేమోనని ఈటల అనుకున్నారు. కానీ.. ఉపఎన్నిక ఎప్పుడు ఉంటుందో… పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. లోకల్లో ఉన్న ఒకటీ అరా బీజేపీ క్యాడర్… ఈటల పొడ గిట్టక.. వేరే దారి చూసుకుంటున్నారు. ఇలా సమస్యలన్నీ చుట్టుముడుతూండటంతో ఈటలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని సన్నిహితులు వాపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి బ్రేక్ తీసుకోవడానికి పాదయాత్రకు వ్యూహాత్మకంగా విరామం ఇచ్చారని మరికొంత మంది అంటున్నారు.