మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ సభ్యుడు కిష్టారెడ్డి మరణం కారణంగా వచ్చే నెల 13న జరుగబోయే ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆయన కుమారుడు సంజీవ రెడ్డినే అభ్యర్ధిగా నిలుపుతోంది. ఆయనను పార్టీలోకి ఆకర్షించి తమ అభ్యర్ధిగా నిలబెట్టాలని తెరాస భావించింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చేయి. కానీ ఆయన మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకోవడంతో పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికలలో తమ అభ్యర్ధిగా భూపాల్ రెడ్డిని నిలబెడుతున్నట్లు తెరాస ప్రకటించింది. వరంగల్ ఉప ఎన్నికలలో పట్టుబట్టి తెదేపా నుంచి సీటు తీసుకొని ఘోరపరాజయం పాలయిన బీజేపీ ఈసారి నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని తెదేపాకు విడిచి పెట్టేసింది. కనుక తెదేపా తరపున విజయపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసాయి కనుక ఇక ప్రచారం జోరందుకోవచ్చును.
ఈ ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధిని గెలిపించే బాధ్యత మంత్రి హరీష్ రావుకి అప్పగించబడింది కనుక ఆయన చాల రోజులుగా అక్కడే మకాం వేసి ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తున్నారు. తెరాస అభ్యర్ధి భూపాల్ రెడ్డి గత ఎన్నికలలో కిష్టారెడ్డి చేతిలో ఓడిపోయారు. మళ్ళీ ఆయన కొడుకు సంజీవ రెడ్డితో పోటీ పడుతున్నారిప్పుడు. ఒకవేళ నారాయణఖేడ్ నియోజకవర్గంలో కిష్టారెడ్డి కుటుంబం పట్ల ప్రజలలో ఇంకా సానుభూతి నెలకొని ఉంటే ఆయన కుమారుడు సంజీవ రెడ్డికే విజయావకాశాలుంటాయి.
కానీ ఆయన గెలిచినంత మాత్రాన్న కాంగ్రెస్ పార్టీ సంబరపడటానికి కుదరక పోవచ్చును. ఎందుకంటే ఆయన ఈ ఎన్నికలకు ముందే తెరాసలోకి వెళ్ళిపోవాలని చూసారు. ఒకవేళ ఆయనే గెలిచినట్లయితే,ఆయనని తెరాసలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేయవచ్చును. తెరాస ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక దానిలోకి ఆయన మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆయన ఈ ఎన్నికలలో గెలిచినా తరువాత తెరాసలోకి మారినట్లయితే, ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పడిన శ్రమ అంతా వృధా అయిపోయినట్లే.పైగా కాంగ్రెస్ ఖాతాలో చేరవలసిన ఎమ్మెల్యే సీటు తెరాస ఖాతాలోకి వెళ్ళిపోతుంది. మరి ఈవిషయం కాంగ్రెస్ నేతలకి తెలియదనుకోలేము. అయినా సంజీవ రెడ్డికే పార్టీ టికెట్ ఇచ్చేరంటే ఎన్నికల తరువాత ఆయన పార్టీ మారబోరని గట్టి నమ్మకం ఉందనుకోవాలా? ఏమో?