తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానంపై అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనపై అవినీతి కేసుల్లో సాక్ష్యాలు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే.. అసలు అరెస్ట్ చేసిన విధానమే ఏ మాత్రం సమంజసంగా లేదన్న అభిప్రాయంలో ఎక్కువ మంది ఉన్నారు. అర్థరాత్రి కొన్ని వందల మంది పోలీసుల్ని మోహరించి .. తెల్లవారుజామునే అరెస్ట్ చేయడం.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నరో కూడా చంద్రబాబుకు చెప్పకపోవడం వివాదాస్పదమయింది. ఆ వీడియోలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఏ కేసులో.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పబోమని పోలీసులు చెప్పడం వైరల్ అయింది.
చంద్రబాబుకు అన్ని రాజకీయ పార్టీలు సంఘిభావం ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్ట్ చేశారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పవన్ కల్యాణఅ ప్రశ్నించారు. చంద్రబాబుకు నా సంపూర్ణ మద్దతు- ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్నారు. ఆయన చంద్రబాబుకు సంఘిభావం తెలిపేందుకు నేరుగా విజయవాడ వెళ్లారు. ఇక బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ప్రొసీజర్ పాటించకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. కమ్యూనిస్టు పార్టీలు.. కాంగ్రెస్ నేత తులసీరెడ్డి కూడా ఖండించారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ర్యాలీలా చాలా చోట్ల తిప్పి తీసుకు వచ్చారు. ఇది ఆయా ప్రాంతాల్లో టీడీపీ బల ప్రదర్శనకు వాడుకుంది. చాలా చోట్ల పోలీసులు కాన్వాయ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. చంద్రబాబుపై సానుభూతి పెంచడానికి ఇదంతా చేసినట్లుగా మారిపోయింది. రాజకీయాలో ముఖ్య నేతల అరెస్టులు అత్యధిక సార్లు మిస్ ఫైర్ అయ్యాయి. సీఎం జగన్ కూడా పదహారు నెలలు జైల్లో ఉన్నారు.