ఈ సంక్రాంతికి వస్తున్న రెండు పెద్ద సినిమాలతో రెండు చిన్న సినిమాలు పోటీకి దిగాయి. అవే… శతమానం భవతి, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రా య్య. శతమానం భవతి దిల్రాజు సినిమా కాబట్టి ఆయనకు థియేటర్ల కొరత లేదు. ఎటొచ్చి నారాయణమూర్తి సినిమానే బలైపోతోంది. ఈనెల 14న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఒక్క థియేటర్ కూడా దక్కలేదట. దాంతో రెడ్ స్టార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ”చిరంజీవి, బాలకృష్ణ మధ్యలో పీపుల్ స్టార్ అంటున్నారు. వాళ్లతో నాకు పోటీ లేదు. అయితే…నా సినిమాకి ఒక థియేటర్ కూడా దొరకని పరిస్థితి. ఒక థియేటర్ కూడా దొరకడం లేదు అంటే ఏడుపు వస్తుంది. కొంత మంది చేతుల్లో థియేటర్స్ ఉండడడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది. చిన్న సినిమాకి ధియేటర్స్ దొరకకపోవడం అంటే దుర్మార్గం చర్య. చిన్న సినిమాలకు థియేటర్స్ లభించేలా చూడాల్సిన బాధ్యత ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, గవర్నమెంట్ పై ఉంది. క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఒకే సినిమాని అన్ని థియేటర్స్ లో వేస్తున్నారు. చిన్న సినిమాలు పండగ లేనప్పుడు, పెద్ద సినిమాలు లేనప్పుడు రిలీజ్ చేయాలా..? సక్సెస్ ఫెయిల్యూర్ అనేది జనం నిర్ణయిస్తారు. ఇండస్ట్రీ ఏ ఒక్కరిదో కాదు.. అందరిది. చిన్న సినిమాలకు న్యాయం చేయమని కోరుతున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన.
నిజానికి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసే ఉద్దేశం చిత్రబృందానికి లేదు. అది సడన్గా తీసుకొన్న నిర్ణయమే. ఈ సినిమాకి కనీసం 50 థియేటర్లయినా దొరుకుతాయని చిత్రబృందం భావించింది. కానీ పట్టుమని 20 థియేటర్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. అయినా సరే.. ఏదోలా థియేటర్లు దక్కించుకోవాలని చదలవాడ ప్రయత్నిస్తున్నారు. అనుకొన్న థియేటర్లు దొరక్కపోయినా.. తమ సినిమాని విడుదల చేయడం ఖాయమని చదలవాడ చెబుతున్నారు. సో.. పీపుల్స్ వార్ ఈ సంక్రాంతికి జెండా ఎగరేయాలనే నిర్ణయానికి వచ్చేశారన్నమాట. మరి ఈ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరుకుతాయో చూడాలి.