ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంది. భౌగోళికంగా విభజించేసింది. తమ పార్టీ నేతల విజ్ఞప్తులు.. ఆశలు.. అంచనాలకు తగ్గట్టుగా గీతలు గీసేసి.. జిల్లాల విభజన చేసేసింది. కలెక్టర్లు, ఎస్పీలను నియమించేసింది. పాతవో.. కొత్తవో.. పనికొచ్చేవో.. పనికిరానివో కానీ భవనాలకు కూడా బోర్డులను తగిలించేశారు. ఇక కొత్త జిల్లాలలో పాలన అని ప్రకటించబోతున్నారు. సోమవారం నుంచి కొత్త జిల్లాలు ప్రారంభమవుతాయి. అంటే ఇక పాత జిల్లాలు లేనట్లేనా..? అంటే. అలాంటిదేమీ పాత జిల్లాలు కూడా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.
స్థానిక సంస్థల ప్రభుత్వాలు జిల్లా, మండల పరిషత్‌లలో ఉంటాయి. జిల్లాపరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీలు ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లు ఉన్నారు. ఇప్పుడు జిల్లాలను విభజించేశారు. జిల్లా పరిషత్‌లను కూడా విభజించేసి..ఏ జిల్లాకు ఆ జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన లేదని.. పాత జిల్లా పరిషత్‌లే ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రస్తుతానికి అసలు పరిషత్‌లను విభజించే ఉద్దేశం లేదని ప్రకటించేశారు. బొత్స ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం పాత జిల్లాల ఉనికిని లేకుండా చేసినప్పుడు ఆ జిల్లాల ప్రాతిపదికన స్థానిక ప్రభుత్వాల పాలన సాగడం అనేక సమస్యలనుసృష్టిస్తోంది.
అయితే ఇప్పుడు జిల్లా పరిషత్‌లను కూడా విభజించడం ద్వారా అనేక సమస్యలు వస్తాయని వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జిల్లాల విభజనలో మండలాలు… ఓ జిల్లాలోకి .. నియోజవర్గం మరో జిల్లాలోకి వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎలా చూసినా.. ఇప్పుడు జిల్లాపరిషత్‌లు విభజించాలంటే గందరగరోళం అయిపోతుంది. అందుకే.. ఈ టర్మ్ వరకూ పాత జిల్లాలనే కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే జిల్లాల విభజనఆలోచన ఉన్నవారు అసలు పరిషత్ ఎన్నికలుపట్టుబట్టి ఎందుకు నిర్వహించారన్నది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎప్పుడు ఏది చేయాలనుకుంటే అది చేయాలనే పాలసీలో భాగంగా చేసేస్తున్నారని నిట్టూరుస్తున్నారు.