యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించడం మంచిది కాదనే బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ అభిప్రాయాన్ని దేశ ప్రజలు తిరస్కరించడంతో తనకి ఇంకా ప్రధానిగా కొనసాగే ఎంత మాత్రం అర్హత లేదని భావించి తన పదవిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఆయన స్థానంలో థెరిసా మే పేరుని అధికార కన్సర్వేటివ్ పార్టీ ఖరారు చేసింది. ఆమె బుదవారం బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణలో 51.89 శాతం ప్రజలు మాత్రమే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించాలని కోరుకొన్నారు. మిగిలిన 48.11శాతం మంది డేవిడ్ కామరూన్ అభిప్రాయాన్ని గట్టిగా బలపరిచారు. కనుక దేశ ప్రజలు తన నిర్ణయాన్ని ఆమోదించలేదని కామరూన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసిన అవసరం లేదు. ఎవరూ ఆయనని తప్పుకోమని డిమాండ్ చేయలేదు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారి శాతమే కొద్దిగా ఎక్కువగా ఉండటంతో డేవిడ్ కామరూన్ తన పదవి నుంచి తప్పుకొంటున్నారు. ఎటువంటి వివాదాలు, హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా అధికార మార్పిడి కార్యక్రమం జరిగిపోతోంది.
బ్రిటన్ లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలని చూస్తే ఆ దేశంలో రాజకీయ నేతలు, పార్టీలు ప్రజలకి, వారి అభిప్రాయానికి, ప్రజాస్వామ్యానికి ఎంతటి విలువనిస్తారో కళ్ళకి కట్టినట్లు కనబడుతోంది. అదే మన దేశంలో ప్రభుత్వాలు, మంత్రులపై ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా, ఎన్ని చార్జ్ షీట్లు నమోదైనా కూడా, కోర్టులు తప్పు పడుతున్నా, జైలుకి కూడా వెళ్లి వచ్చినా, తమ వల్ల ఎన్ని తప్పులు, లోపాలు జరుగుతున్నాకూడా మన రాజకీయ నేతలు నిసిగ్గుగా అధికారంలో కొనసాగుతుంటారు. తమ తప్పులు, తప్పుడు నిర్ణయాలకి, పొరపాట్లకి దేశానికి, రాష్ట్రానికి ప్రజలకి తీవ్ర నష్టం జరుగుతున్నా, చివరికి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా నిర్లజ్జగా పదవులలో కొనసాగేవారు కోకొల్లలున్నారు. ఎమ్మెల్సీ సీటు దక్కనందుకో, మంత్రి పదవులకి ఆశపడో పార్టీలు మారే నేతలు మనకున్నారు. ఇదే మన రాజకీయ నేతలకి, బ్రిటన్ నేతలకి ఉన్న తేడా. ఆ తేడా ఎప్పటికి అలాగే ఉంటుందని, దానిని తగ్గించడం ఎవరి వల్లా సాధ్యం కాదని మనకీ తెలుసు.