తమిళనాట తన ప్రభుత్వంతో విజయ్ ఓ చిన్న సైజు యుద్ధమే చేస్తున్నాడు. అదీ.. తన తేరీ సినిమాకోసం. విజయ్- సమంత జంటగా నటించిన సినిమా తేరి. తెలుగులో పోలీసోడు పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 14న అంటే రేపు తమిళనాడులో ఈ సినిమా విడుదల అవుతుంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకి ఓ పెద్ద సమస్య వచ్చింది. పెద్ద సినిమా, అందులోనూ భారీ అంచనాలున్నాయి.. అందుకే తొలిరోజు టికెట్ రేటు పెంచి అమ్మాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. అయితే.. తమిళ నాడు ప్రభుత్వం మాత్రం విజయ్ సినిమాకి షాక్ ఇచ్చింది. రేటు పెంచుకోవడానికి వీల్లేదని, ఎప్పటిలా రెగ్యులర్ రేట్లకే అమ్మాలని ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో తేరి సినిమాని భారీ రేట్లకు కొనుక్కొన్న పంపిణీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామూలు రేట్లకు అమ్మితే మునిగిపోతామని, ఈ విషయంలో ప్రభుత్వం దయ చూపించాలని కోరుకొంటున్నారు.అయితే.. ప్రభుత్వం కూడా ససేమీరా అంటోందట. అలాగైతే ఈ సినిమా విడుదల ఆపేయడం మినహా మరో మార్గం లేదని థియేటర్ యజమానులు, పంపిణీదారులు చెబుతున్నారు. మరో వైపు విజయ్… ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి తన ప్రయత్నాలు చేస్తున్నాడు.చివరికి ఏమవుతుందో చూడాలి. అన్నట్టు తెలుగులో ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.