ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సన్నద్ధమౌతున్నారా..? వచ్చే ఏడాది డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయా..? ఆ దిశగానే అధికార పార్టీని నడిపేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారా.. అంటే, అవుననే చెప్పాలి. సీఎం చంద్రబాబు నోట మరోసారి ఈ ముందస్తు ప్రస్థావన రావడం విశేషం. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపు నేపథ్యంలో పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చిన అంశాలేంటనేది ప్రధానంగా చర్చించారు. దీంతోపాటు పార్టీలో సరిదిద్దుకోవాల్సిన లోపాలపై కూడా దృష్టిసారించారు. ఇదే సమయంలో ముందస్తు ప్రస్థావన తెచ్చారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ 2018 డిసెంబర్ లో జరగబోతున్న ఎన్నికలు సిద్ధం కావాలని సూచించినట్టు సమాచారం.
ఇదే ప్రస్థావన చాన్నాళ్ల కిందట తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు కేంద్రం నుంచి కూడా సీఎం చంద్రబాబుకు ముందస్తు సంకేతాలు అందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలకు చంద్రబాబు మూడు రకాల మేనేజ్మెంట్ ల గురించి చెప్పారు. పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, పబ్లిక్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అనే అతి విశ్వాసంలో నాయకుడు ఉండొద్దనీ, రాబోయే ఎన్నికలన్నీ ఏకపక్షంగా టీడీపీ గెలిచేందుకు కృషి చేయాలని అన్నారట. ఛాన్స్ తీసుకోవడానికి తాను సిద్ధంగా లేననీ, ప్రతీ ఎన్నిక నుంచీ నాయకులు పాఠాలు నేర్చుకోవాలనీ అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్ని మోడల్ గా తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం విశేషం! అంతేకాదు, ఈ రెండు ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి వ్యూహాలను అనుసరించిందో వివరించేందుకు ఓ పుస్తకం కూడా రూపొందిస్తున్నారు. దాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల నేతలకూ ఇవ్వబోతున్నారట!
ముందస్తు ఎన్నికలు సిద్ధం కావడం వరకూ బాగానే ఉంది! ఎలాగూ కేంద్రం కూడా అదే మూడ్ లో కేబినెట్ విస్తరణ చేసింది. డిసెంబర్ లోనే జమిలి ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉన్నట్టు కూడా ఈ మధ్య కథనాలు వచ్చాయి. అది సరే, ఆంధ్రాలో అన్ని నియోజక వర్గాల్లోనూ నంద్యాల, కాకినాడ మోడల్ ను అనుసరించాలనడమే చర్చనీయాంశం! ఆ రెండు ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పార్టీ శ్రేణులు స్ఫూర్తిగా తీసుకోవడం వరకూ బాగుంటుంది. కానీ, అవే వ్యూహాలు రాష్ట్రవ్యాప్తంగా అంటే… కరెక్ట్ కాదేమో అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే, నంద్యాల ఉప ఎన్నిక కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగింది. అధికార పార్టీ సర్వశక్తులూ అక్కడ ఒడ్డాల్సి వచ్చింది. తెలుగుదేశం గెలుపును నిర్ణయించిన ప్రమాణాలు వేరేగా ఉన్నాయి. అవే పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఇతర నియోజక వర్గాల్లో ఉండవు కదా!
ఇక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కుల సమీకరణకు ప్రధానంగా కలిసొచ్చాయి. ఈ గెలుపు రహస్యాలపై ప్రత్యేకంగా పుస్తకాలు రాయాల్సిన అవసరం లేదు కదా! అందరికీ తెలిసినవే. అయినాసరే, అవే రోల్ మోడల్ గా తీసుకోవాలంటే… నంద్యాల జరిగిన విధంగానే 175 నియోజక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలి. ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వచ్చే ఏడాదిపాటు అభివృద్ధి పనుల వేగం పెంచాలి. అప్పుడు నంద్యాల రోల్ మోడల్ అవుతుంది!