తెలుగు360 రేటింగ్ : 3/5
కోర్టు రూమ్ డ్రామాలకు ఈమధ్య డిమాండ్ ఎక్కువైంది. బాలీవుడ్ లో ఈ ఫార్మెట్ వర్కవుట్ అవ్వడంతో – తెలుగులోనూ `నాంది`లాంటి కథలు పుట్టుకొచ్చాయి. `పింక్` ఇక్కడ రీమేక్ చేశారు. `తిమ్మరుసు` కూడా ఓ రకంగా కోర్టు రూమ్ డ్రామానే. ఓ క్లోజ్డ్ కేసుని ఎనిమిదేళ్ల తరవాత తిరగతోడడం, అసలైన నిందుతుల్ని పట్టుకోవడం – `తిమ్మరుసు` కాన్సెప్టు. చాలా కాలం తరవాత థియేటర్లోకి వచ్చిన సినిమా కాబట్టి… ఓరకంగా ప్రేక్షకుల దృష్టి అవసరమైన దానికంటే ఎక్కవే పడింది. మరింతకీ ఈ `తిమ్మరుసు` ఎలా ఉన్నాడు. థియేటర్లో ఓ మంచి సినిమా చూడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సగటు తెలుగు ప్రేక్షకుడి ఆశ నెరవేర్చాడా?
కథలోకి వెళదాం. 2011లో నడిరోడ్డుపై ఓ క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురవుతాడు. ఆ నేరం… వాసు అనే ఓ అమాయకుడిపై పడుతుంది. పోలీసులు, లాయర్లు ఏకమై వాసుని జైలుకి పంపిస్తారు. ఎనిమిదేళ్ల శిక్షని కూడా అనుభవిస్తాడు. అయితే… ఈ కేసుని మళ్లీ తిరగతోడతాడు లాయర్ రామ చంద్ర (సత్యదేవ్). లోతుల్లోకి వెళ్లే కొద్దీ… ఈ కేసులో కొత్త నిజాలు, కొత్త దోషులు బయటకు వస్తుంటారు. అసలింతకీ… క్యాబ్ డ్రైవర్ ని చంపింది ఎవరు? ఆ కేసులోకి వాసు ఎందుకొచ్చాడు? ఈ నిజాల్ని రామ చంద్ర ఎలా బయటకు తీయగలిగాడు? అనేదే కథ.
సాధారణంగా కోర్టు రూమ్ డ్రామా అంటే వాదోపవాదనలు ఎక్కువగా ఉంటాయి. `తిమ్మరుసు`లో మాత్రం ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎక్కువ. పాత కేసుని మళ్లీ ఓపెన్ చేసి, దాని మూలాల్లోకి వెళ్లడంతో కొత్త నిజాలు, కొత్త ట్విస్టులు, కొత్త పాత్రలు బయటకు వస్తుంటాయి. అదే.. తిమ్మరుసు ప్రత్యేకత. క్యాబ్ డ్రైవర్ హత్యతో.. కథని చాలా ఇంట్రస్టింగ్ గా మొదలెట్టారు. ఆ తరవాత.. లాయర్ గా సత్యదేవ్ ఎంట్రీ, తనకు రావూస్ అసోసియేట్స్ లో ఉద్యోగం దొరకడం.. వాసు కేసుని టేకప్ చేయడం – ఇలా ప్రతీ సన్నివేశం… ఈ సినిమాపై ఆసక్తి ని పెంచుకుంటూ పోతుంది. వాసుని నిర్దోషి అని ముందే చెప్పేసి, హత్య ఎందుకు జరిగిందో తొలి సన్నివేశంలోనే క్లూ ఇచ్చేసి, ఆ తరవాత కథని అంతే ఆసక్తిగా నడపడం మామూలు విషయం కాదు, ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయినట్టే. మామూలుగా ఇలాంటి థ్రిల్లర్స్ లో… క్లైమాక్స్ ట్విస్టు కీలకం. ఈ సినిమాలోనూ అలాంటి ట్విస్టు ఉంది. ఒకటి కాదు. రెండూ. అయితే అందులో ఒకటి.. బాగుంటే, రెండోది దర్శకుడు తన సౌలభ్యం కోసం రాసుకున్న ట్విస్టులా అనిపిస్తుంది. ఆ రెండు ట్విస్టులూ తెరపై చూడాల్సిందే.
దర్శకుడు తనకు అనువుగా కథని నడపడం.. క్లైమాక్స్ లోనే కాదు. ముందూ జరిగింది. వాసు కేసుని టేకప్ చేసినప్పుడు ఏ లాయర్ అయినా, వాసు దగ్గర నుంచి మొత్తం సమాచారం తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ అలా జరగదు. వాసు… విడతల వారీగా… తన కథని చెబుతుంటాడు. దాంతో.. కేసులో పలు ఆటంకాలు వస్తుంటాయి. ఉదాహరణకు… రీనా జోసెఫ్ పాత్ర. రీనా గురించి వాసు ముందే లాయర్ రామచంద్రకి చెప్పాలి. కానీ అలా చెప్పడు. కథకు ఎప్పుడు ఆ పాత్ర అవసరం అవుతుందో.. అప్పుడు ఆ విషయాన్ని వాసుతో చెప్పిస్తారు. రాష్ట్రపతికి క్షమాభిక్ష అడుగుతూ వాసు లేఖ రాసే విషయం కూడా… అంతే. దర్శకుడు తనకు అనువుగా ఆ సన్నివేశాల్ని రివీల్ చేసుకున్నాడు. ఇదంతా.. దర్శకుడు తనకు అనువుగా స్క్రిప్టు రాసుకున్నాడు అనడానికి సాక్ష్యాలు.
కోఇన్సిడెన్స్ ఈ సినిమాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు… హీరో ఇంటి ముందు నుంచీ… పాత పేపర్లు కొంటాం.. పాత పేపర్లు కొంటాం అంటూ ఓ వ్యక్తి వెళ్తున్నప్పుడే ఈ కేసులో పాత పేపర్ల అవసరం ఎంతో… హీరోకి అర్థమవుతుంది. ఆ వెంటనే పాత పేపర్లని తెప్పించి కేసు స్టడీ చేస్తాడు. అక్కడ హీరోకి ఓ క్లూ దొరుకుతుంది. అలానే.. ఫోన్ సిగ్నల్స్ దొరకలేనప్పుడు, తన కళ్ల ముందు ఓ యాక్సిడెంట్ జరిగినప్పుడు…. ఇలాంటి కో ఇన్సిడెంట్స్లోనే ఈ కేసుకి సంబంధించిన క్లూలు పట్టుకుంటాడు. అదంతా పరమ సినిమాటిక్ గా కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ (అజయ్), ఓ లాయర్ (రవిబాబు) పక్కదోవ పట్టిస్తుంటారు. హీరోకి వార్నింగులు ఇస్తుంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారా? అనిపిస్తే – చివరికి ఓ బలహీనమైన కారణం చూపించారు. ఆ కారణం అతకలేదు. అయితే.. క్లైమాక్స్ కి ముందు కొత్త నేరస్థుడ్ని బయటకు తీసుకొచ్చి ఓ ట్విస్టు ఇచ్చారు. అది మాత్రం ఓకే అనిపిస్తుంది.
సత్యదేవ్ ఎంత బ్రిలియంట్ యాక్టరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో అది మరోసారి నిరూపితమైంది. ఈ పాత్రకు ఎంత కావాలో, ఎంత ఇవ్వాలో సరిగ్గా తూనికలు తూసినట్టు అంతే ఇచ్చాడు. తన లుక్ నచ్చుతుంది. లిఫ్ట్ ఫైట్ లో తనలో ఓ కమర్షియల్ హీరో కూడా ఉన్నాడన్న విషయాన్ని నిరూపించాడు. ప్రియాంక జవల్కర్ ఏ ఫ్రేములోనూ హీరోయిన్ అనిపించలేదు. సత్యదేవ్‌కి అక్కలా, మిగిలినవాళ్లకు ఆంటీలా ఉంది. క్లోజప్ లో మాత్రం అస్సలు చూడలేం. బ్రహ్మాజీ పాత్ర, తన డైలాగులు కాస్త టైమ్ పాస్ కలిగిస్తాయి. వాసుగా కనిపించిన అబ్బాయి చాలా సహజంగా నటించాడు.
సాంకేతికంగా చూస్తే… స్క్రిప్టు పకడ్బందీగానే రాసుకున్నాడు. చాలాచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. యూ ట్యూబ్ ఫాలోవర్లకు బాగా పరిచస్థుడైన శాక్రిఫైజింగ్ స్టార్ ఎపిసోడ్ ఈ సినిమాలో గుర్తు చేశారు. బ్రహ్మాజీ ఓ సందర్భంలో బాలయ్యని ఇమిటేట్ చేయడం నవ్విస్తుంది. కొన్ని డైలాగులు బాగున్నాయి. `కొన్ని సార్లు మన దగ్గర చెప్పడానికి నిజం ఉన్నా, వినడానికి మనిషి ఉండడు` లాంటి డైలాగుల్లో డెప్త్ ఉంది. పాటలకు చోటివ్వకుండా దర్శకుడు చాలా మంచి పని చేశాడు.
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు మనకూ వస్తుంటాయి. కాకపోతే… కమర్షియల్ హంగుల కోసం పాటలు, కామెడీ ట్రాకులు పెట్టి ఆ కాన్సెప్ట్ ని పాడుచేస్తుంటారు. తిమ్మరుసులో మాత్రం ఆ ప్రమాదం జరగలేదు. పనిగట్టుకుని థియేటర్లకు వెళ్లి చూడాల్సిన సినిమా కాకపోయినా… థియేటర్లకు వెళ్తే మాత్రం కచ్చితంగా టికెట్ రేటుకి న్యాయం జరుగుతుంది.
ఫినిషింగ్ టచ్: బ్రీఫ్ `కేస్`తో కొట్టాడు
తెలుగు360 రేటింగ్ : 3/5