తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పెద్ద ఎత్తున ధాన్యం పండింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణం ఈ సారి సన్న రకం వరినే ఎక్కువగా పండించారు. వాటిని చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనాలని నిర్ణయించుకుంది. అందుకే అందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే.. పొరుగు రాష్ట్ర అనుభవాలు తెలంగాణ సర్కార్ను భయపెట్టినట్లుగా ఉన్నాయి. అందుకే.. ప్రచారం చేసుకోవవద్దని నిర్ణయించుకుంది. సన్నబియ్యం ఇస్తున్నామని ప్రచారం చేసుకుని తీరా… కొంత మందికి ఆ బియ్యం అందకపోయినా చెడ్డ పేరు వస్తుందని.. ఉన్నంత వరకూ .. అందరికీ సన్న బియ్యమే పంపిణీ చేయాలని నిర్ణయించారు.
తెల్లరేషన్ కార్డు దారులందరికీ సన్నబియ్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి ఓ 30, 40 కేబినెట్ భేటీలు జరిగి ఉంటాయి కానీ.. అది మాత్రం అమలు కాలేదు. మధ్యలో పౌరసరఫరాల మంత్రి ఎవరు చెప్పారు అని ఎదురు తిరిగి .. సన్న బియ్యానికి నాణ్యమైన బియ్యం అని పేరు పెట్టారు. అవి కూడా ఎవరికీ అందడం లేదు. అనాలోచితంగా నిర్ణయం తీసుకుని.. విపరతీమైన ప్రచారం చేసుకోవడం వల్ల.. ఈ పరిస్థితి వచ్చిందని ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఇప్పిటికీ అర్థం కాలేదు. మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్లుగా వాయిదాలు వేస్తూ పోతున్నారు. ఇప్పటికే మూడు పంట సీజన్లు మారినా … రేషన్ పంపిణీకి కావాల్సిన సన్నబియ్యం సేకరించలేకపోయారంటే.. ఇంక ఎప్పుడు సేకరిస్తారో చెప్పడం కష్టం,.
తెలంగాణలో సాగునీటి వసతి పెరగడంతో పెద్ద ఎత్తున వరి పండిస్తున్నారు. నియంత్రిత సాగు విధానంతో ఎంత అవసరమో… అంత మేర రైతులతో పంట పండిస్తున్నారు. ఈ కారణంగా ప్రణాళికా బద్దంగా సన్నబియ్యం పంపిణీ చేయడానికి అవసరమైన వనరులు సమీకరించుకున్నట్లుగా అవుతోంది. కానీ ఏపీలో మాత్రం ప్రణాళిక లేకపోవడం.. ఏడాదిన్నర దాటిపోయినా సన్నబియ్యం ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు దారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి అసంతృప్తి ప్రజల్లో కనిపించకూడదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.