గంజాయి మత్తులో దాడులు… గంజాయిత మత్తులో హత్యలు.. గంజాయి మత్తులో అత్యాచారాలు.. గంజాయి గ్యాంగుల హల్ చల్. ఇవి వార్తలు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ.. ఏపీలో దాదాపుగా ప్రతీ వీధిలో కనిపించే దరిద్రం. సీఎం జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలో గంజాయి గుప్పు మంటుంది. శనివారం కూడా అక్కడ ఓ నలుగురు ముఠాను పట్టుకున్నారు. ఇలాంటివి పట్టుకోవాలే కానీ.. గంజాయి దొరకని ప్రదేశం అంటూ ఏపీలో లేదు. ఎందుకు ?
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలు లేకపోతే .. ఇలా గంజాయి రాష్ట్రమంతటా గుప్పుమనడం సాధ్యమేనా ?. కాలేజీలు, యూనివర్శిటీల దగ్గర చూస్తే.. ఈ గంజాయి బానిసలు ఎంత మంది ఉంటారో చూస్తే ఒళ్ల గగుర్పొడుస్తుంది. యువత ఇంత బానిసలుగా మారుతున్నారా అని ఆశ్చర్యపోతారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా విశాఖ ఏజెన్సీ నుంచే సరఫరా అవుతుంది. అక్కడి నుంచి సరఫరా అయిన గంజాయిని గుర్గావ్ లో పట్టుకుంటారు.. భోపాల్ లో పట్టుకుంటారు.. కోల్ కతాలో పట్టుకుంటారు.. చివరికి ఈశాన్య రాష్ట్రాల్లోనూ పట్టుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో లెక్కలేదు. అక్కడి పోలీసులు విశాఖకు వచ్చి సైలెంట్ ఆపరేషన్లు చేసి నిందితుల్ని పట్టుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏపీ పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు. ఎలా సేఫ్ గా సరిహద్దులు దాటిపోతోంది ఆ సరుకంతా ?. ఈ విషయం అందరికీ తెలుసు. తెలియనట్లు నటిస్తున్నారు.
దాటిపోయే సరుకు దాటిపోతుంది.. ఏపీలో వినియోగమయ్యే సరుకు వినియోగమవుతుంది. అది ఒక్క గంజాయితోనే సరిపెట్టుకోలేదు.. చాలా పెద్ద డ్రగ్స్ ముఠాలు ఉన్నాయని బ్రెజిల్ నుంచి వచ్చిన సరుకుతోనే తేలిపోయింది. ఆ కేసు ఏమయిందో ఎవరికీ తెలియదు. అంత పెద్ద డ్రగ్స్ కేసు .. అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని తెలిసినప్పుడు తీసుకునే చర్యల్లో కనీస మాత్రం తీసుకోలేదు. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమవుతుంది ?
పిల్లలు డ్రగ్స్ కు బానిసగా అయితే ఆ ఒక్క కుటుంబం మాత్రమే నష్టపోదు.. మొత్తం సమాజనం నష్టపోతుంది. దాని వల్ల రాష్ట్రానికి.. చివరికి దేశానికి నష్టం జరుగుతుంది. మరి లాభం ఎవరికి జరుగుతుంది ?. ఈ గంజాయి వ్యాపారం చేసిన వాడికే లాభం జరుగుతుంది. సమాజాన్ని ధ్వంసం చేసే పాలకులు .. స్వార్థం కోసం ఆలోచించేవారు బాగుపడతారు. కానీ మన బిడ్డలు బాగుపడవద్దా.. వారిని గంజాయికి బానిసల్ని చేసి.. మనం పాలకులకు బానిసలుగా బతుకుదామా ?. ఓటేసే ముందు ఆలోచించండి… ఓటును మంచివాళ్లకు వేయండి !